కేంద్రం మూడేళ్లుగా పారాబాయిల్డ్ తగ్గించమని చెబుతోంది

కేంద్రం మూడేళ్లుగా పారాబాయిల్డ్ తగ్గించమని చెబుతోంది

రాష్ట్రంలోని రైతులకు ఫ్రీ ఎరువులు ఇస్తామన్న సీఎం కేసీఆర్..ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ . జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..ఏమైనా అంటే మా పైనా.. మా అధ్యక్షుడి పైనా కోడిగుడ్లు కొడుతున్నారని అన్నారు. ఈటల రాజేందర్ మా పార్టీలోకి వచ్చారు..గుడ్లు కొడితే ఆయన పౌల్ట్రీకే లాభమని తెలిపారు.

 చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెరవడం లేదో కేసీఆర్ చెప్పాలన్నారు అర్వింద్. ఇథనాలు డిమాండ్ పెరుగుతున్నందున చెరుకు ఫ్యాక్టరీలతో లాభం ఉంటుందని చెప్పారు. కొత్త చెరుకు ఫ్యాక్టరీలు పెడదామని ఎవరైనా ముందుకు వచ్చినా అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. మొక్కజొన్న, చెరుకు నుంచి ఎక్కువ శాతం ఇథనాలు పొందే అవకాశం ఉందని..అయితే ఈ రెండు పంటలను కేసీఆర్ వద్దంటున్నాడని చెప్పారు. 

పంజాబ్ రైతులకు 3 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తాడట.. స్వాగతిస్తున్నాం. ఇస్తే ఇవ్వు... కానీ ముందుగా తెలంగాణ రైతులు 8 ఏళ్లుగా పంట నష్టపోతున్న రైతులను ఆదుకోమని అన్నారు ఎంపీ అర్వింద్. కల్లాల్లో ఉన్న ధాన్యం కొనకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ తో తాడో పేడో తేల్చుకుంటా.. దీనికోసం రైతులను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఉంది కదా.. పోలీసులు ఉన్నారని మామీద దాడి చేస్తే ఊరుకోబోమన్నారు.

ముఖ్యమంత్రి అనేటోడు ఎక్కడైనా ధర్నా చేస్తాడా? అని ప్రశ్నించారు అర్వింద్. మూడేళ్లుగా కేంద్రం పారాబాయిల్డ్ తగ్గించమని చెబుతూనే ఉందన్నారు. వరికి ఇతర రాష్ట్రాల్లో బోనస్ ఇస్తున్నారు.. కానీ తెలంగాణలో మాత్రం ఇవ్వడం లేదని తెలిపారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్లు ధాన్యం 1500లకు కొంటామని చెబుతున్నారు. మీరు మరో 350 ఇస్తే చాలు రైతులకు MSP వస్తుందన్నారు. 

రాష్ట్రంలో ఆస్పత్రులు, స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం.. మీరు చేస్తున్న పాలన ఎలా ఉంది? అని ప్రశ్నించారు ఎంపీ అర్వింద్. తక్షణమే పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలన్నారు.

కేంద్రం కొనేంత ధాన్యం కొంటుంది... మిగతాది మీరు కొనాలన్నారు. చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కేటీఆర్ సహా.. మీ నాయకులను ప్రజలు ఉరికిస్తారన్నారు. ఇక్కడ కవితనే ఓడించారు.. కొడుకొక లెక్కా? అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతకాలం దోచుకు తిన్నారని అన్నారు అర్వింద్.