గుజరాత్, మధ్య ప్రదేశ్​ను కేసీఆర్ మోడల్ గా తీసుకోవాలి : ఎంపీ అర్వింద్

గుజరాత్, మధ్య ప్రదేశ్​ను కేసీఆర్ మోడల్ గా  తీసుకోవాలి : ఎంపీ అర్వింద్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని ఇండ్లకు వచ్చినంత కరెంట్ బిల్లులు.. దేశంలో ఎక్కడా లేవని, ఇదేనా కేసీఆర్ మార్క్ పాలనా అంటే అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. కేసీఆర్​ కొడుకు కేటీఆర్, బిడ్డ కవిత ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఫైర్​ అయ్యారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాల కమిటీ సభ్యులతో కలిసి.. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్ సర్కార్ అంధకారంలోకి నెడుతోందని మండిపడ్డారు. కేంద్రం తీసుకువచ్చే కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లులో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడైనా ఉంటే చూపించాలని కేసీఆర్​ను సవాల్ చేశారు. ఇక్కడి పేదలకు పెన్షన్ ఇస్తున్నానని కేసీఆర్ గొప్పగా చెప్తున్నరు. పెన్షన్ రూ.2 వేలు వస్తే.. కరెంట్ బిల్లు రూ.10 వేల రూపాయలు వస్తోందని ఆరోపించారు.

ఒక యూనిట్ కరెంట్ కు రూ.10 చెల్లించాల్సి వస్తోందని, అదే ఎండాకాలంలో అయితే రూ.20 వరకు కట్టాల్సి వస్తుందని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో యూనిట్ కరెంట్ కు గృహ అవసరాల కోసం కేవలం రూ.2. 60 పైసల నుంచి 5 రూపాయల లోపే ఉందన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే యూనిట్​కు రూ. 9. 50 పైసల నుంచి  రూ.1‌‌‌‌‌‌‌‌0 కరెంట్ బిల్లులను కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ తన కొడుకు, బిడ్డ కమీషన్ల కోసమే ఎక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం తెచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లుతో వీళ్ల కరెంట్ కమీషన్ల దందా ఆగిపోతుందనే ఆ బిల్లును వ్యతిరేకిస్తూ.. దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఖర్గేకు కవిత ఫోన్ చేసిన్రు..

తన బిడ్డను బీజేపీ వాళ్లు కొనే ప్రయత్నం చేశారని కేసీఆర్ అనడంపై అర్వింద్ మండిపడ్డారు. తన తండ్రి కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే కవిత కాంగ్రెస్ లో చేరుతానంటూ ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని నాకు స్వయంగా ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఒకరు ఫోన్ చేసి చెప్పారన్నారు. దీంతోనే కవితను..కేసీఆర్ ములాయం అంత్యక్రియలు ప్రోగ్రామ్ కు వెంట తీసుకెళ్లి మీడియాకు  ఫోటోలు రిలీజ్ చేశారని చెప్పారు. అయినా కవితను మేము ఎందుకు చేర్చుకుంటమని, మా పార్టీలో ఏ లీడరైనా సరే కవితను చేర్చుకుంటం అంటే అతన్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు బండి సంజయ్, నడ్డాలను కోరుతున్నానన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీపై చేస్తున్న ఆరోపణలపై కేసీఆర్ ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.

తిరిగి బీజేపీలో చేరిన దుబ్బాక మండల మాజీ అధ్యక్షుడు 

మూడు రోజుల కింద మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్​లో చేరిన దుబ్బాక మండల బీజేపీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్ తిరిగి కమలం కండువా కప్పుకున్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సమక్షంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు నాయకత్వంలో మళ్లీ బీజేపీలో చేరారు.

కొత్త ప్లాంట్లు ఎందుకు కట్టలేదు

2014 ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ఇచ్చిన 10 థర్మల్ పవర్ ప్లాంట్​ల ఏర్పాటు ఏమైందని అర్వింద్ ప్రశ్నించారు. ఈ ఎనిమిదేళ్లలో రామగుండంలో పాత వాటి స్థానంలో కొత్త ప్లాంట్ లు నిర్మించేందుకు ఎందుకు శ్రద్ధ చూపడం లేదని నిలదీశారు. ఇప్పుడున్న ప్లాంట్ లతో ఎక్కువ పొల్యూషన్.. తక్కువ పవర్ జనరేట్ అవుతుందని, ఆ మిషనరీల కాలం చెల్లిందన్నారు. విద్యుత్తులో గుజరాత్, మధ్య ప్రదేశ్​ను మోడల్ గా కేసీఆర్ తీసుకోవాలని సూచించారు. అక్కడి రైతులకు సబ్సిడీపై సోలార్ ప్యానెల్స్ అందిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పార్టీలను ఎంకరేజ్ చేస్తున్నాడని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. వేలాది కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, రేషన్ బియ్యం కూడా టైమ్ కు అందడం లేదని, వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇలాంటి సిల్లీ సీఎంను ఎక్కడా చూడలేదన్నారు.