ఓల్డ్‌సిటీ వెలుగు: ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని ‘హే అల్లా.. ఇస్ జంగ్ కో జల్దీ రోక్ దే’ అంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రార్థించారు. అల్విదా జుమ్మా ప్రార్థనల సందర్భంగా శుక్రవారం మక్కా మసీదులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.15 వేల ఏండ్ల కింద మదీనాలో రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయని, కానీ ప్రస్తుత యుద్ధం కారణంగా అక్కడ మసీదులు మూతపడి వేలాది మంది కేవలం నీటితోనే ఇండ్లలో దీక్షలు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రక్త బంధాన్ని, మానవత్వాన్ని మరిచి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. భారత్ నిజంగా తటస్థంగా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మన వాణికి మరింత ప్రభావం ఉండేదన్నారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలోనే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ఎందుకు పర్యటించారని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోదీల మధ్య లైలా మజ్ను ఆట నడుస్తుందని విమర్శించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ అని గొప్పలు చెప్పుకునే ప్రధాని మోదీ గ్యాస్ విషయంలో ఏం చేశారని ప్రశ్నించారు.
గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కోటి మంది భారతీయుల గురించి కేంద్రం ఆలోచించడం లేదన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. భారతదేశంలో 67 శాతం హిందూ యువత విద్యావంతులైనా వారికి ఉపాధి కల్పించలేదని, బతుకుతెరువు కోసం పోరాడి మానవత్వాన్ని నిలుపుదామా లేదా మతతత్వాన్ని పెంచుదామా అని యువతను
ప్రశ్నించారు.
