NRC, NPR.. రెండూ ఒక్కటే: అసదుద్దీన్ ఒవైసీ

NRC, NPR.. రెండూ ఒక్కటే: అసదుద్దీన్ ఒవైసీ
  • మతం పేరుతో మోడీ దేశాన్ని విడదీయాలనుకుంటున్నడు
  • ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

నిజామాబాద్, వెలుగు: సెక్యులర్ దేశాన్ని మతం పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ విడదీయాలనుకుంటున్నాడని, ఎన్సార్సీ, ఎన్​పీఆర్​నాణేనికి రెండు వైపులని ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సీఏఏ, ఎన్సార్సీకి వ్యతిరేకంగా నిజామాబాద్ నగరంలో టీఆర్‍ఎస్ తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు చట్టాలు చేయడం తప్పని తామనడం లేదని, అయితే మతం పేరుతో దేశాన్ని మార్చే చట్టాలు చేయడం తప్పని అన్నారు. అందుకే సిటిజన్ అమెండ్ మెంట్​యాక్ట్ ను పార్లమెంటులో వ్యతిరేకించామన్నారు. అది దేశంలోని ముస్లింలకే కాదు, హిందువులకు కూడా నష్టం కలిగించే బిల్లు కావడంతో పార్లమెంటులో ఆ కాగితాలను చించేశానన్నారు. కాగితాలనే కాదు, అవసరమైతే మిమ్మల్ని కూడా చించుతానన్నారు. 2010 లో తెచ్చిన ఎన్‍పీఆర్, 2020 వచ్చే ఎన్‍పీఆర్ లో చాలా మార్పులున్నాయని, వాటిని కప్పిపుచ్చి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. అస్సాంలో ఎన్నార్సీ చట్టం ద్వారా 19 లక్షల పేర్లు రాలేదన్నారు. ముస్లిం పేర్లున్న వారికి అస్సాం  సిటిజన్‍షిప్‍లో పేర్లు గల్లంతు చేశారని అన్నారు. కేవలం మోదీ నోటి మాటల్లోనే సబ్‍కా సాత్ సబ్‍కా వికాస్ ఉందని, ఆచరణలో, అమల్లో లేదన్నారు. ఎన్సార్సీ, ఎన్‍పీఆర్ లో ఉన్న నిబంధనలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. వాటి ద్వారా సేకరించే వివరాల కారణంగా మనం ఈ దేశవాసులమే అని రుజువు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుందని తెలిపారు. డౌట్‍ఫుల్ సిటిజన్‍ కింద పడేసి నానా తిప్పలు పెట్టే యాక్ట్ ను ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలన్నారు.

నేను, కేసీఆర్ బతికున్నన్నాళ్లు బంధం ఉంటది

సెక్యులరిజానికి, రాజ్యాంగానికి విలువనిచ్చే గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఒవైసీ అన్నారు. ఆయన బతికున్నన్నాళ్లు ఆయనతో తన బంధం ముడిపడి ఉంటదని చెప్పారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ దేవుళ్లను నమ్ముతారని, గుళ్లకు కూడా పోతారని ఒవైసీ అన్నారు. కానీ మోడీ దేవుడి పేరుమీద దేశాన్ని మార్చే ఆలోచన చేస్తే, కేసీఆర్ సెక్యులర్ భావాలతో ముందుకెళతారన్నారు.

MP Asaduddin Owaisi spoke at a meeting organized in Nizamabad city against the CAA and the NCR