NPRపై సీఎం కేసీఆర్ స్టే విధించాలన్న ఓవైసీ

NPRపై సీఎం కేసీఆర్ స్టే విధించాలన్న ఓవైసీ

కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నేషనల్​ పాపులేషన్​ రిజిస్ట్రీ(ఎన్పీఆర్)​పై స్టే విధించాలని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ఒవైసీ డిమాండ్​చేశారు. ఎన్పీఆర్, ​-ఎన్ఆర్సీ, -సీఏఏకు వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్ మాసబ్​ట్యాంక్​లోని​బిలాల్​గ్రౌండ్​లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చే బిల్లులతో ప్రజల్లో అభద్రత ఏర్పడుతోందని, ముందుగా ఎన్పీఆర్, తర్వాత ఎన్ఆర్సీ, ఆ వెంటనే సీఏఏ అమలు చేయడం వల్ల ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందని అసద్​ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్​అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా పూర్తిగా స్టే విధించాలని డిమాండ్ ​చేశారు. రాష్ట్ర హోంమంత్రి ముందుగా ఎన్పీఆర్​ గురించి తెలుసుకోవాలని, ముస్లిం ప్రజలకు కూడా మీరు నాయకుడనే విషయం మరచిపోవద్దని సూచించారు. అమెరికా ప్రెసిడెంట్ ఢిల్లీకి వచ్చిన సమయంలో అక్కడ అల్లర్లు చెలరేగడం విచారకరమన్నారు. పోలీసుల సమక్షంలోనే అల్లరి మూకలు కాల్పులు జరపడం దారుణమని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రధాని, కేంద్ర హోంమంత్రిపై ఉందన్నారు.