సునీల్ వీడియో మరణ వాంగ్ములంగా తీసుకొని కేసీఆర్ మీద కేసు పెట్టాలి

సునీల్ వీడియో మరణ వాంగ్ములంగా తీసుకొని కేసీఆర్ మీద కేసు పెట్టాలి

ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంలేదని సూసైడ్ చేసుకొని చనిపోయిన బోడ సునీల్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు మార్చురి దగ్గర విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. సునీల్‌ది ఆత్మహత్య కాదని.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని విద్యార్థులు మండిపడుతున్నారు. సునీల్ కుంటుంబాన్ని సర్కార్ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

సునీల్ ఆత్మహత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. సునీల్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘సునీల్ చివరి మాటలను మరణ వాంగ్ములంగా తీసుకొని కేసీఆర్ మీద కేసు పెట్టాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు తెలంగాణలో ఉన్నడా? ఫాంహౌజ్‌లో ఉన్నడా? లేక ప్రగతిభవన్‌లో ఉన్నడా? ఎంతమందిని బలితీసుకుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఉద్యోగాలన్నీ కేసీఆర్ కుటుంబానికే వచ్చాయి. యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దు. జెండాలను పక్కకు పెట్టి ఏకైక అజెండాతో ముందుకు పోదాం. అన్నీ పార్టీలను, సంఘాలను కలుపుకొని ప్రభుత్వం మీద యుద్ధం చేద్దాం. ప్రభుత్వం వెంటనే సనీల్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. సునీల్ కోరిక మేరకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని బండి సంజయ్ అన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. విద్యార్థులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సునీల్ కోరిక ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని కోరారు.