బీజేపీతో పొత్తు కోసం పార్టీలు తహతహలాడుతున్నయ్

బీజేపీతో పొత్తు కోసం పార్టీలు తహతహలాడుతున్నయ్

నాగర్ కర్నూలు: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బండి ఫైర్ అయ్యారు. అబద్ధపు మాటలు, హద్దులు దాటిన హామీలు, తప్పతాగిన మైకంలో సీఎం చేసే చేష్టలకు ప్రజలు విసుగెత్తిపోయారని మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. కార్యకర్తలతో కలసి బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యమ సమయంలో, అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

‘కేసీఆర్.. లక్ష ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావ్. ఒక్క నోటిఫికేషన్ కూడా వేయని చరిత్ర నీది. నీ పాలనలో రైతులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆత్మహత్యలే మిగిలాయి. ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే.. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న సమయంలో కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో అమలు పరుస్తున్న కేంద్ర సంక్షేమ పథకాలకు ప్రధాని ఫొటో తొలగించి నీ ఫొటోతో సోకులు చేసుకుంటున్నావ్. రానున్న కాలంలో నాగర్ కర్నూలు జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం గెలిచి తీరుతాం. 2023 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వయంగా అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి. గడీల పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9న హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర షురూ చేస్తా’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.