రాష్ట్రంలో వచ్చేది మా ప్రభుత్వమే

రాష్ట్రంలో వచ్చేది మా ప్రభుత్వమే

 

  • బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్
  • ఎన్నికలైనంక కేసీఆర్ అమెరికాకు బిస్తరు సర్దుతరు
  • టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తయ్
  • పార్టీలన్నీ కలిసి బీజేపీని ఎదుర్కోడానికొస్తున్నయ్
  • 12వ రోజు నారాయణపేట జిల్లా మక్తల్‌‌లో ప్రజా సంగ్రామ యాత్ర

నారాయణపేట, మక్తల్, వెలుగు: రాష్ట్రంలో ఎంతమంది పీకేలు వచ్చినా ఏం చేయలేరని, వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ అమెరికాకు బిస్తరు సర్దే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 12వ రోజైన సోమవారం సాయంత్రం మక్తల్‌‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘మొదట విడతలో భాగ్యలక్ష్మి దేవాలయం, రెండో విడతలో జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభించాం. ప్రతి గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయటమే మా లక్ష్యం. పాతబస్తీలో మేం యాత్ర స్టార్ట్ చేశాకే తెలంగాణ ప్రజలకు భరోసా ఏర్పడింది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే టీఆర్ఎస్‌‌కు భయమేస్తోంది” అని చెప్పారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే

కాంగ్రెస్‌‌లో ఎవరూ గెలవరని.. గెలిచినా ఆ పార్టీలో ఉండరని.. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని బండి సంజయ్ విమర్శించారు. ‘‘పీకే టిఫిన్ ప్రగతి భవన్‌‌లో.. లంచ్ ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో చేస్తారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయి. రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నది వాస్తవం. టీఆర్ఎస్‌‌ను ఎదుర్కొనేది బీజేపీ ఒక్కటే. ఒకప్పుడు 2 ఎంపీ స్థానాలున్న బీజేపీ ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నది. ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో ఉన్నం. త్వరలో రాష్ట్రాన్ని ఏలుతం” అని చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, గ్రామాలకు నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని గుర్తించుకోవాలన్నారు. ప్రతి పైసా మోడీ ఇస్తుంటే ప్రజలకు దక్కకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.

బీజేపీకి భయపడి పీకేని తెచ్చుకున్నడు

బీజేపీకి భయపడి పీకేని స్ర్టాటజిస్టుగా కేసీఆర్ పెట్టుకున్నారని సంజయ్ విమర్శించారు. అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఎదుర్కోడానికి ఎన్నికలకు వస్తున్నాయని చెప్పారు. ‘‘పేదోళ్లు ఆత్మబలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. కానీ పెద్దోడు రాజ్యమేలుతున్నడు. గరీబోళ్ల రాజ్యం కోసం బీజేపీ మలిదశ ఉద్యమం ప్రారంభించింది. గడీలు బద్దలు కొట్టి తెలంగాణ ద్రోహిని తరిమికొట్టడానికి ప్రజలు ముందుకురావాలి. ఏడాది టైం ఇస్తే కొట్లాడి గడీల పాలనను అంతమొందిస్తం” అని తెలిపారు.

టీఆర్ఎస్‌‌కు ఏటీఎంలా కాళేశ్వరం: రహత్కర్

బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.7 ఏండ్లలో సెక్రటేరియట్‌‌కు పోని సీఎంగా కేసీఆర్‌‌‌‌ గిన్నిస్​బుక్‌‌ రికార్డుల్లోకి ఎక్కుతారన్నారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతున్నదని, రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. టీఆర్ఎస్‌‌కు ఏటీఎంలా మారిందన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అభినందిస్తున్నానని, 119 నియోజకవర్గాల్లో ఆయన యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

పాదయాత్ర కొనసాగుతది

సంజయ్ యాత్రకు రెండు రోజులు రెస్ట్ అని వస్తున్న వార్తలను పాదయాత్ర కోఆర్డినేటర్ మనోహర్​రెడ్డి ఖండించారు. స్వల్ప అస్వస్థతకు బండి సంజయ్ గురయ్యారని, డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పినా ఆయన పాదయాత్ర చేయాడానికే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ లీడర్లు కక్షకట్టి వేధిస్తున్నరు

మక్తల్ మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ పావని కంటతడి మహిళనని కూడా చూడకుండా తనను టీఆర్ఎస్ లీడర్లు వేధిస్తున్నారని, ఒక్క పని కూడా చేయనీయడం లేదని మక్తల్ మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ పావని కంటతడి పెట్టారు. మక్తల్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మక్తల్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకున్నందున టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడి ఎమ్మెల్యే తమపై కక్ష కట్టారన్నారు. బీజేపీని వదిలి టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే తప్ప మున్సిపాలిటీకి నయా పైసా ఇచ్చేది లేదని వేధిస్తున్నరని వాపోయారు.