ఆ దయ్యాలపై కవిత.. సీబీఐకి ఫిర్యాదు చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఆ దయ్యాలపై కవిత.. సీబీఐకి ఫిర్యాదు చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • లేదంటే అదంతా డ్రామా అని తేలిపోద్ది

న్యూఢిల్లీ, వెలుగు: గత పదేండ్లలో కేసీఆర్ వద్ద ఉన్న దయ్యాలు చేసిన అవినీతిని.. కవిత రాష్ట్ర ప్రజలకు తెలపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆ దయ్యాల కుంభకోణాలు, అక్రమాలపై విచారణకు సీబీఐకి ఫిర్యాదు చేయాలని హితవు పలికారు. లేదంటే కవిత లేఖ ఒక డ్రామాగా మిగిలిపోతుందన్నారు. ‘చెల్లి కవిత లొల్లి’తో కేటీఆర్ మైండ్ దొబ్బిందని ఎద్దేవా చేశారు. కవిత అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ ల్ కేసులో సీఎం ఉన్నారంటూ పాత చింతకాయ పచ్చడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో చామల మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సీఎం రేవంత్ రెడ్డి పేరును చేర్చిందని.. సీఎం రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారని.. అయితే.. లిక్కర్ కేసులో ఆయన చెల్లి కవితను ఈడీ అరెస్ట్ చేసిందని.. అంటే, ఆమె కూడా లిక్కర్ దందా చేసినట్లేనా అని చామల ప్రశ్నించారు.  కవిత లేఖపై కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి అసలు విషయాలు చెప్పాలన్నారు. 

ఆ మూడు దయ్యాలే కేసీఆర్​ను  ప్రజలకు దూరం చేశాయి: ఎంపీ మల్లు రవి

కవిత తన లేఖలో పేర్కొన్న మూడు దయ్యాలు కేటీఆర్, హరీశ్, సంతోష్ అని ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ విషయం ప్రజలకు కూడా అర్థమైందన్నారు. ఈ మూడు దయ్యాలే కేసీఆర్ ను ప్రజలకు దూరం చేశాయని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో పీసీసీ అధికార ప్రతినిధి సుధాకర్ గౌడ్ తో కలిసి మల్లు రవి మీడియాతో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిని లొట్టపీసు అని వ్యాఖ్యానించిప్పుడే కేటీఆర్ పరిణతి, మానసిక స్థితి ఏంటో అర్థమైందన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తోందన్నారు. ప్రతిపక్ష నేతలను వేధించేందుకే బీజేపీ ఈడీని ఉపయోగిస్తోందని ఆరోపించారు. వాటికి ఎట్టి పరిస్థితుల్లో తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.