బీఆర్ఎస్‎లో చీలికలకు కవిత లేఖే నిదర్శనం.. KTR ఆన్సర్ చెప్పాలి: MP చామల

బీఆర్ఎస్‎లో చీలికలకు కవిత లేఖే నిదర్శనం.. KTR ఆన్సర్ చెప్పాలి: MP చామల

హైదరాబాద్: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా తెలంగాణ పాలిటిక్స్‎లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్టీలో మూడు ముక్కల ఆట నడుస్తోందని.. బీఆర్ఎస్ టాప్ లీడర్స్ కవిత, హరీష్ రావు, కేటీఆర్ మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని రాజకీయ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఎవరికి వారే అన్న చందంగా ఆ పార్టీలు పరిస్థితి తయారైందని.. కవిత, హరీష్ రావు వేరు కుంపటి పెట్టడానికి సిద్ధమయ్యారని తెలంగాణ పొలిటికల్ కారిడార్లలో వార్తలు కోడైకూస్తున్నాయి.

ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లేఖ స్టేట్ పాలిటిక్స్‎లో సంచలనం సృష్టించింది. పార్టీలోని తాజా పరిస్థితులపై తన తండ్రిని ప్రశ్నిస్తూ కవిత లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు బీఆర్ఎస్ లో చీలిక మొదలైందని అధికార కాంగ్రెస్, బీజేపీ కార్నర్ చేస్తోన్న వేళ.. ఏకంగా కేసీఆర్ కూతురే ఆయనకు లేఖ రాయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కవిత లేఖతో బీఆర్ఎస్‎లో లుకలుకలు నిజమేనని చర్చ షూరు అయ్యింది. 

ఇదిలా ఉంటే.. తన తండ్రికి కవిత రాసిన లేఖ, అందులో ఆమె పేర్కొన్న కొన్ని అంశాలు అధికార కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రంగా మారాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. ఆ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని మేం చెప్పినదానికి కవిత లేఖే నిదర్శమని కాంగ్రెస్ దాడి మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత లేఖపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. 

గురువారం (మే 22) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో చీలికలకు కవిత లేఖే నిదర్శమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్‎కు అప్పగిస్తారని కవిత, హరీష్ రావు ఆందోళనలో ఉన్నారన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినట్లు కవిత లేఖ రాశారు..  కవిత లేఖకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతోన్న వాస్తవాలు బయటకు వస్తు్న్నాయన్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా కవిత లేఖపై రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో ముసలం తారాస్థాయికి చేరిందని.. కవిత రాసిన లేఖతో  ఆ పార్టీ లుకలుకలు బయపపడ్డాయని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పని చేస్తోందని కాంగ్రెస్ చెప్పిన మాటలను కవిత సమర్థించారని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్ సిద్ధమవుతున్నారని లేఖ ద్వారా కవిత చెప్పకనే చెప్పేశారన్నారు. 

కవిత లేఖపై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఇద్దరికి మాత్రమే పరిమితమైందని కవిత లేఖతో తెలిపోయింది. హరీష్ రావు ఇంటికెళ్లి కేటీఆర్ ఆయనను బతిమాలుతున్నారు. బీఆర్ఎస్ పని అయిపోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.