
- అమృత్ స్కీమ్‌తో ప్రజాధనం కాపాడాం
న్యూఢిల్లీ, వెలుగు: అమృత్ 2.0 కాంట్రాక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చామల పాల్గొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘అమృత్ కాంట్రాక్ట్ వ్యవహారంలో రేవంత్‌ను టార్గెట్ చేసి కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లోనే కేటీఆర్ ఫ్రెండ్స్ అయిన ఏపీ ఎంపీ మిథున్ రెడ్డి, సత్యం రామలింగ రాజు కొడుకు, మేఘా కృష్ణా రెడ్డికి అమృత్ కాంట్రాక్ట్‌లో మూడు ప్యాకేజీల ద్వారా రూ.3,656 కోట్లు విలువ చేసే టెండర్లు దక్కాయి.
డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంట్రాక్టుల్లో జరిగిన తప్పిదాలను సీఎం రేవంత్ గుర్తించి రిటైడర్లను ఆహ్వానించారు. రూ.3,602 కోట్లకు కాంట్రాక్ట్ ఫైనల్ అయింది. రూ.54 కోట్ల ప్రజా ధనాన్ని కాంగ్రెస్ సేవ్ చేసింది. అడవిలో ఆహా రం కోసం పులి వెతికినట్టు.. పైసలకు అలవాటుపడ్డ కేటీ ఆర్.. ప్రతి రోజూ ఏదో ఒక విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నడు’’అని చామల మండిపడ్డారు.