- ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సదుద్దేశంతో చేసిన వ్యాఖ్యలను రాజకీయ స్వార్థంతో వక్రీకరించడం సరికాదని హితవు పలికారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ 140 ఏండ్ల చరిత్ర, అంతర్గత ప్రజాస్వామ్యం, మల్టీపుల్ లీడర్‌షిప్ వంటి వాటిని వివరిస్తూ సీఎం రేవంత్ మాట్లాడారు.
అందులోకి కులం, మతం, హిందువుల మనోభావాలను చొప్పించి రాజకీయ చేయడం మంచిది కాదు. హిందూ సంప్రదాయంలో ఉన్న అనేక దేవతల వైవిధ్యాన్ని సీఎం ఉదాహరణగా చెప్పారు” అని పేర్కొన్నారు. వివిధ ఆలోచనలు, నాయకత్వాలు అన్నీ ఒకే పార్టీ పురోగతికి దోహదం చేస్తాయనే భావాన్నే సీఎం రేవంత్ చెప్పే ప్రయత్నం చేశారని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు.
