ఏపీ నుంచి రూ.408 కోట్ల బకాయిలు ఇప్పించండి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఏపీ నుంచి రూ.408 కోట్ల బకాయిలు ఇప్పించండి:  ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • .377 కింద లోక్ సభలో ప్రస్తావించిన ఎంపీ చామల 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.408.49 కోట్ల బకాయిలు వడ్డీతో సహా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో రూల్ 377 కింద ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన తర్వాత పదేండ్లు ఉమ్మడిగా సేవలందించిన రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, జ్యుడీషియల్ అకాడమీ వంటి రాజ్యాంగ సంస్థలు, ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన వ్యయానికి సంబంధించిన ఈ మొత్తాన్ని ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం చెల్లించలేదని గుర్తుచేశారు. తెలంగాణకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని అభ్యర్థించారు.  

బీఆర్ఎస్, బీజేపీలవి డ్రామాలు..

నీట్‌ పేపర్‌ లీకేజీపై బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్‌ పాలనలోనే గ్రూప్‌-1, టెన్త్ క్లాస్ పేపర్లు లీక్‌ అయ్యాయని, అప్పుడు బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్‌ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌తో అంటకాగిన బీజేపీ, ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతోందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.