బీజేపీ ధర్నా చేస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నరు

బీజేపీ ధర్నా చేస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నరు

నిజామాబాద్, వెలుగు: బీజేపీ ధర్నా చేస్తే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారని, పసుపు రైతులకు మంత్రి ఏం చేశారో చెప్పాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఎన్నికైన 5 నెలల్లోనే పసుపు సమస్యల పరిష్కారానికి కేంద్రాన్ని ఒప్పించానని చెప్పారు. స్పైసెస్ బోర్డు ఎక్స్​టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, రూ.30 కోట్ల నిధులు తెచ్చానన్నారు. పసుపు పంటకు గతంలో కంటే ఎక్కువగానే మద్దతు ధర ఇచ్చామని తెలిపారు. నిజామాబాద్ వేల్పూర్ క్రాస్ రోడ్‌‌లో మంగళవారం ప్రజాగోస బీజేపీ భరోసా రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో జిల్లా రాష్ట్రానికే  ఆదర్శమని చెప్పారు. మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు పేరుతో కాలయాపన చేశారని విమర్శించారు. తాము పసుపు దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచామని చెప్పారు. నిజామాబాద్ నుంచి పసుపుని విదేశాలకు ఎగుమతి చేశామని చెప్పారు.

సబ్సిడీ ఎగ్గొట్టిన్రు

రైతుబంధు ఇచ్చి సబ్సిడీలను ఎగ్గొట్టిన ఘనత టీఆర్ఎస్‌‌కే దక్కుతుందని అర్వింద్ ఎద్దేవా చేశారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాసి.. ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. 1.40 కోట్ల టన్నుల రాష్ట్ర వడ్లు కేంద్రం కొనుగోలు చేసిందని చెప్పారు. వడ్ల కొనుగోళ్లకు  రాష్ట్రం నయా పైసా ఖర్చు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినవేనని అన్నారు. వరదల్లో జనం ఇబ్బందులు పడుతుంటే సీఎం, మంత్రులు మాత్రం జల్సాలు చేశారని అర్వింద్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ యువకులను మోసగించారని మండిపడ్డారు. కేసీఆర్‌‌‌‌వి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన బియ్యంతో బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపిన ఘనులు తండ్రీకొడుకులని ఆరోపించారు.