రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

న్యూఢిల్లీ, వెలుగు:హైకోర్టు ఆదేశించినా బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వలేదని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని ఎంపీ ధర్మపురి అర్వింద్  మండిపడ్డారు. ఈటల రాజేందర్  గెలుపును కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. వెయ్యి కోట్ల నల్లధనం, 4 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్​కు చెంప చెల్లుమనిపించారని ఆయన అన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో అర్వింద్​ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారనే బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, నాయకులకు పోయే కాలం వచ్చినప్పుడే ఇలాంటి మతిస్థిమితం లేని నిర్ణయాలు తీసుకుంటారని ఫైర్​ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ కొందరు నేతలు ఇలాంటి నిర్ణయాల వల్ల అధికారం కోల్పోయారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించడం కేసీఆర్ మస్తికి నిదర్శనమని ఆయన ఘాటుగా విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఒకప్పుడు మంచి పేరు ఉండేదని,  కానీ, ఇప్పుడు ఆయనను కేసీఆర్  కంట్రోల్​ చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరాపార్క్ లో బీజేపీ ఎమ్మెల్యేలు చేపట్టిన ప్రజా పరిరక్షణ దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు అర్వింద్​ ప్రకటించారు. 

ప్రగతిభవన్​ రోడ్లెందుకు క్లోజ్​ చేశారో చెప్పాలి

ఆర్మీని ప్రశ్నిస్తున్న కేటీఆర్.. ముందు కేసీఆర్ ప్రగతి భవన్ రోడ్లు ఎందుకు క్లోజ్ చేశారో చెప్పాలని అర్వింద్​ డిమాండ్ చేశారు. ఓట్లేసిన ప్రజల్నే కేసీఆర్ కలవనివ్వట్లేదని, ప్రగతి భవన్​కు  భారీ గోడలు, ఫెన్సింగ్, పెద్ద గేట్లు ఎందుకని నిలదీశారు. ‘‘ఫాంహౌస్​ నుంచి సెక్రటేరియట్​కు కేసీఆర్​ పోనికి కంటోన్మెంట్​లో రోడ్లు వెడల్పు కావు. అక్కడ కాన్వాయ్ ఎల్లంగనే ఇక్కడ గేట్లు ఓపెన్ చేయరు. దేశ భద్రతకు సంబంధించిన ఐఎస్ వో, డీఆర్ డీవో వంటి అనేక రక్షణ సంస్థలు కంటోన్మెంట్ లో ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్మీ పై ఉంది” అని ఆయన చెప్పారు.