- లగచర్ల ఫార్మా విలేజ్రద్దుపై ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, వెలుగు: కొడంగల్ నియోజకవర్గం లగచర్ల రైతుల పోరాటం ఫలించిందని, ఎట్టకేలకు ఈ అంశంపై రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కితగ్గిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఫార్మా విలేజ్ పేరుతో లగచర్ల, పరిసర గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం రైతుల విజయమని చెప్పారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా ఇలాగే చేతులు కాల్చుకోక తప్పదని పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తానున్ననట్టు వెల్లడించారు. ప్రజల అభిప్రాయాలను ఏ ప్రభుత్వమైనా గౌరవించి తీరాల్సిందేనని, రైతుల పంట పొలాల్లో విషం చిమ్ముతానంటే తాను ఊరుకోబోనని హెచ్చరించారు. ఇప్పటికైనా లగచర్ల, పరిసర గ్రామాల్లోని ప్రజలు, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని అరుణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.