
మహబూబ్ నగర్: ఎంపీ ఎన్నికల్లో తాను ఓడిపోవాలని కొందరు పార్టీ నాయకులు పనిచేశారని, ఆ రిపోర్టు అధిష్టానం వద్ద ఉందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇవాళ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ.. 'జై శ్రీరాం అంటాం కదా.. ఆ శ్రీరాముడి మీద ఒట్టేసి చెప్పండి.. మీరంతా బీజేపీకి అనుకూలంగా పనిచేశారా..?” అంటూ వేదికపై నుంచి ప్రశ్నించారు. ఎవరెవరు తన ఓటమి కోసం పనిచేశారో వాళ్ల తోకలు కత్తిరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కోరారు. ఆ నివేదికను పున: పరిశీలించాలని అన్నారు.
ఎంపీ ఎన్నికల వేళ పార్టీ లైన్ కు వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఆనాడు రాజీనామా చేయించినోళ్లు ఇవాళ మీటింగ్ కు రావడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ అంటే క్రమ శిక్షణకు మారుపేరని, క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు న్యూట్రల్ గా ఉంటారని తామంతా నమ్ముతున్నట్టు చెప్పారు. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇచ్చినా అందరం కలిసే పనిచేస్తామని చెప్పుకొచ్చారు.