- టీచర్ల సమస్యను లోక్‌సభలో లేవనెత్తిన ఎంపీ డీకే అరుణ
న్యూఢిల్లీ, వెలుగు: ఐదేండ్లకు పైగా సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులందరూ టెట్‌లో తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. రైట్ టు ఎడ్యుకేషన్ (ఆర్టీఈ) యాక్ట్– 2009కి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ డీకే అరుణ కోరారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో రూల్ 377 కింద ఈ అంశాన్ని లేవనెత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఐదేండ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్నవారు, టెట్ లేకుండా కొనసాగవచ్చని, వారికి ప్రమోషన్లకు అర్హత ఉండదన్నారు.
అలాగే, ఐదేండ్ల సర్వీస్ ఉన్న టెట్ క్వాలిఫై కాకపోతే.. తప్పనిసరిగా ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది, తెలంగాణలో సుమారు 40 వేల మంది ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన చెందుతున్నారని సభ దృష్టికి తెచ్చారు.
2010కి ముందు ఉద్యోగం పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీచర్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని గుర్తుచేశారు. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చట్ట సవరణ చేపట్టి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రిని ఆమె కోరారు.
