బీజేపీ టార్గెట్ ఛాలెంజింగ్.. ఎంపీ ఎలక్షన్స్ కిషన్ రెడ్డికి పరీక్షే!

బీజేపీ టార్గెట్ ఛాలెంజింగ్.. ఎంపీ ఎలక్షన్స్ కిషన్ రెడ్డికి పరీక్షే!

 

  • స్టేట్ ప్రెసిడెంట్​గా, కేంద్ర మంత్రిగా చాలెంజింగ్ ​రోల్ ​తప్పనిసరి 
  • టార్గెట్ రీచ్ ​కాకపోతే పార్టీ నేతల్లో అసంతృప్తి వచ్చే చాన్స్

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పరీక్షగా మారాయి. ఆయన కేంద్ర మంత్రిగా, స్టేట్ ప్రెసిడెంట్​గా కొనసాగుతున్న ఈ టైంలో లోక్​సభ ఎన్నికలు రావడంతో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై అందరిలో ఆసక్తి నెలకొన్నది. పార్టీ అధిష్టానం పెట్టిన టార్గెట్ ​రీచ్ కాకపోతే.. కేడర్​లో కిషన్​రెడ్డి లీడర్ షిప్​పై అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన చాలెంజింగ్​రోల్ నిర్వహించడం​తప్పనిసరి. రాష్ట్రంలో 17 లోక్​సభ సీట్లుండగా.. బీజేపీకి ప్రస్తుతం నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానాలున్నాయి. అయితే, ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావును కాదని.. కొత్త అభ్యర్థి నాగేశ్​కు సీటు కేటాయించారు. దీన్ని అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ ఆయన విజయం అంతా ఈజీ కాదని తెలుస్తోంది. మరోపక్క కిషన్ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్​ సెగ్మెంట్​లో బీఆర్ఎస్ నుంచి పద్మారావుగౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరోపక్క పార్టీలోని కొంత కేడర్ కిషన్​రెడ్డి తమను పట్టించుకోవడం లేదని అలకబూనినట్టు తెలిసింది. ప్రచారంలోనూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇక్కడా ఆయన విజయం సాధించేందుకు గట్టిగానే కష్టపడాల్సి వస్తోంది. 

అధ్యక్ష పదవి నుంచి సంజయ్ నితప్పించడంతో శ్రేణుల్లో అసంతృప్తి​

రాష్ట్రంలో బండి సంజయ్ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాక.. బీజేపీ కేడర్​లో జోష్ పెరిగింది. ఇదే కంటిన్యూ అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 నుంచి 25 సీట్లలో విజయం సాధిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ఆయన్ను ప్రెసిడెంట్ గా తప్పించి, సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో 2018లో బీజేపీలో కేవలం గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించగా, 2023లో మాత్రం ఎనిమిది సీట్లలో గెలిచింది. అయినా, బీజేపీ నేతల్లో అసంతృప్తి అలాగే ఉంది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ నేత లక్ష్మణ్ నేతృత్వంలో నాలుగు సీట్లలో విజయం సాధించింది. అంబర్ పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కిషన్ రెడ్డి.. అప్పటి లోక్​సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచారు.

టార్గెట్ ​రీచ్​పై కేడర్​లో అనుమానాలు

ప్రస్తుత లోక్​సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని నాలుగు సిట్టింగ్ స్థానాలను కాపాడుకుంటూనే, అదనంగా మరో ఆరు సీట్లు సాధించాలనే లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకున్నది. దీనికి అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తోంది. అయితే, బీజేపీలోని గ్రూపుల నేపథ్యంలో ఇన్ని సీట్లు సాధిస్తారా? అనే అనుమానం కిందిస్థాయి కేడర్​ లో మొదలైంది. ఇప్పటికే ఎవరికి వారు వర్గాలు విడిపోయి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలిసిపోతే తప్ప.. అనుకున్న సీట్లు సాధించడం కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్ పెట్టుకున్న సీట్లను సాధించకపోతే, కిషన్ రెడ్డి నాయకత్వంపై కేడర్​లో విముఖత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. దీనికితోడు కేంద్ర నాయకత్వం దృష్టిలోనూ నెగెటివ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో కిషన్ రెడ్డికి ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి.