పెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ పెట్టండి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి

పెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ పెట్టండి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను పార్లమెంట్‌‌లోని తన చాంబర్‌‌‌‌లో కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి– రామగుండం రైల్వే లైన్, పెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల రూ.4 వేల కోట్లతో రామగుండం-పెద్దపల్లి-మనుగూరు రైల్వే లైన్‌‌కు డీపీఆర్ పూర్తయినట్లు లోక్‌‌సభ ద్వారా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. తమ విజ్ఞప్తులపై స్పందించిన కేంద్ర మంత్రి... సెమీకండక్టర్ యూనిట్‌‌కు సంబంధించి ప్రణాళిక, డీపీఆర్ ఇవ్వాలని సూచించారని చెప్పారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రిని కలిసి సెమీకండక్టర్‌‌‌‌ యూనిట్ ఏర్పాటుపై ప్రతిపాదనలు అందజేసినట్లు వెల్లడించారు. అలాగే, రైల్వే, సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌‌ల కోసం పెద్దపల్లి, మంచిర్యాలలో అందుబాటులో భూములు, నీటి సౌకర్యం, మౌలిక వసతులు గురించి వివరించినట్లు చెప్పారు.

అలయన్స్ పాలిటిక్స్‌‌లో పెద్దపల్లికి అన్యాయం.. 

తెలంగాణలోని పెద్దపల్లికి రావాల్సిన సెమీకండక్టర్‌‌‌‌ యూనిట్‌‌ను చివరి నిమిషంలో కేంద్రం ఏపీకి తరలించారని ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు. కేవలం ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్నందుకు ఏపీ సీఎం చంద్రబాబును సంతోషపెట్టేందుకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కేవలం అలయన్స్ పాలిటిక్స్‌‌లో భాగంగా పెద్దపల్లికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పెద్దపల్లి విద్యావంతులు, ప్రతిభావంతులైన యువత కష్టపడి పని చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇలాంటి వారికి సెమీకండక్టర్ యూనిట్ వస్తే.. రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెస్తారని చెప్పారు. రామగుండం ఫర్టిలైజేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, సింగరేణి మాదిరిగా.. ఈ సెమీకండక్టర్ యూనిట్ కూడా సక్సెస్ అవుతుందని తెలిపారు.