
- పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లపై ప్రజాప్రతినిధుల ఫైర్
- ఎంపీ హోదాలో వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పెద్దపల్లి కలెక్టర్‌పై ఎంపీ వంశీకృష్ణ సీరియస్
- ఓ ఎంపీకే సమాధానం ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీత
- ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై విప్ ఆది శ్రీనివాస్ అసహనం
- జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా రావడం, స్వాగతం పలకకపోవడంపై మండిపాటు
పెద్దపల్లి/సిరిసిల్ల, వెలుగు: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి, ఎయిర్ పోర్ట్ భూసేకరణ వివరాలు అడిగితే ‘నా దగ్గర లేవు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం, సమస్యలు దృష్టికి తీసుకెళ్తే స్పందించకపోవడం, మెసేజ్‌లు చేసినా రిప్లై ఇవ్వకపోవడాన్ని ఎంపీ తప్పుపట్టారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ‘స్వస్థ్‌నారీ సశక్త్‌పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఎంపీ వంశీకృష్ణ బుధవారంప్రారంభించారు.
ఈ సందర్భంగా.. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద జరిగే ప్రసూతి ప్రయోజనాలను మహిళలకు వివరించారు. మహిళలు ఈ కార్యక్రమన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసుపత్రికి అంబులెన్స్ అవసరం ఉందని ఎంపీని పెద్దపల్లి జిల్లా ప్రజలు,ఆసుపత్రి సిబ్బంది కోరారు. ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని వంశీకృష్ణ హామీ ఇచ్చారు. తర్వాత పక్కనే కొత్తగా నిర్మిస్తున్న ప్రధాన ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. బిల్డింగ్ పనులు ఎలా జరుగుతున్నాయని కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
కలెక్టర్‌పై వంశీకృష్ణ ఫైర్
ప్రధాన ఆసుపత్రి నిర్మాణ పనులపై ముక్తసరిగా సమాధానం ఇచ్చిన కలెక్టర్ పై ఎంపీ వంశీకృష్ణ సీరియస్ అయ్యారు. ప్రజా సమస్యలపై ఏదైనా సమాచారం కోసం ఫోన్ చేసినా, మెసేజ్చేసినా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈ సందర్బంగా తన ఫోన్ తీసి పాత మెసేజ్‌లు చూపించారు.
‘‘రామగుండం ఎయిర్‌పోర్ట్ భూసేకరణ ఎక్కడిదాకా వచ్చిందని అడిగినా స్పందించరు.. ఈఎస్ఐ ఆసుపత్రి వివరాలు అడిగినా ఇవ్వరు. రామగుండం ఎయిర్‌పోర్ట్ భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతున్నది? ఢిల్లీలో నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను.. కానీ ఇక్కడ మీ డ్యూటీలో నిర్లక్ష్యం కనిపిస్తున్నది.. నా ఫోన్ ఎత్తరు. కనీసం మెసేజ్‌కు రిప్లై కూడా ఇవ్వరు. నా కోసం అడగడం లేదు కదా. ప్రజల కోసమే కదా? ఒక ఎంపీగా నాకే మీరు స్పందించకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?’’ అని కలెక్టర్‌ను ఎంపీ ప్రశ్నించారు.
తాను ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు తనను ఎంపీగా ఎన్నుకున్నారని, తనకు వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉందన్నారు. కలెక్టర్ శ్రీహర్ష మాత్రం ఎంపీకి ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెనుదిరిగారు. కలెక్టర్ మొదటి నుంచీ ఎంపీ వంశీకృష్ణను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. గతంలో జిల్లాలో అధికారిక కార్యక్రమాలపై ఎంపీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది.
2024 నవంబర్‌లో జరిగిన దిశ కమిటీ మీటింగ్‌కు ఎమ్మెల్యేలు హాజరయ్యేలా చూడడంలో కలెక్టర్ఫెయిల్అయ్యారనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా ప్రొటోకాల్ పాటించకపోవడంతో పార్లమెంట్ వ్యవహారాల కార్యదర్శికి ఎంపీ వంశీకృష్ణ ఫిర్యాదు చేయడంతో.. కలెక్టర్ కాస్త దిగివచ్చినట్లు కనిపించారు. కానీ తాజా ఘటన నేపథ్యంలో కలెక్టర్తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
రాజన్న సిరిసిల్ల కలెక్టర్ తీరుపై విప్ ఆది గుస్సా..
రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. సెప్టెంబర్17ను పురస్కరించుకొని బుధవారం ఉదయం సిరిసిల్ల పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం తరుఫున నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ఆలస్యంగా వచ్చారు. కలెక్టర్ ముందుగా వచ్చి.. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలకాల్సి ఉన్నా.. లేట్‌గా రావడం వివాదాస్పదమైంది. అంతేకాదు, ముఖ్యఅతిథిగా తాను సందేశం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అలాంటిదేదీ లేదని కలెక్టర్ మిస్గైడ్చేశారని ఆది శ్రీనివాస్ తెలిపారు.కలెక్టర్ సందీప్కుమార్ఝాతీరుపై కొంతకాలంగా అసహనంతో ఉన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. తాజాగా జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
జెండా ఆవిష్కరణకు కలెక్టర్ డుమ్మా
ప్రజాపాలన దినోత్సవం షెడ్యూల్ ప్రకారం సిరిసిల్ల పరేడ్ గ్రౌండ్‌కు ఉదయం 9.55 గంటలకు కలెక్టర్ చేరుకోవాలి. 10 గంటలకు విప్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించాలి. ఈ క్రమంలోనే 9.58 గంటలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. కలెక్టర్ కోసం 10 గంటల వరకు వేచి చూశారు. అయినా, కలెక్టర్ రాకపోవడంతో విప్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత కలెక్టర్ తాపీగా వేదిక మీదికి వచ్చారు. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో కలెక్టర్ లేకపోవడాన్ని విప్ ఆది శ్రీనివాస్ తప్పుబట్టారు.
కార్యక్రమం అనంతరం ‘‘ఒక కలెక్టర్ అయి ఉండీ సమయపాలన పాటించకపోవడం ఏమిటి?’’ అని మండిపడ్డారు. ప్రజా పాలన వేడుకలకు కనీసం అధికారులను, సిబ్బందిని ఎందుకు సమీకరించలేదని, కలెక్టర్ తీరు వల్ల కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయన్నారు. ‘‘ప్రజాపాలన వేడుకలను కలెక్టర్ సీరియస్‌గా తీసుకోలేదు. కలెక్టరేట్ అధికారులు, స్టాఫ్‌ను కూడా రప్పించలేదు. అందుకే సభ వెలవెలబోయింది. రాత్రి చీఫ్ గెస్ట్ స్పీచ్ ఉందా? అని అడిగితే లేదని చెప్పారు. కానీ చీఫ్ సెక్రటరీని అడిగితే ముఖ్య అతిథి సందేశం ఉందన్నారు’’ అంటూ మీడియాకు ఆది శ్రీనివాస్ వివరించారు.