
టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు. పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మంగళవారం టీడీపీ ముఖ్యనేతలతో సమావేశం అయిన చంద్రబాబు.. లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సీఎం రమేష్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ పదవిని తాను తీసుకోనంటూ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం గమనార్హం.
లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా తనను నియమించడంపై నాని చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కాదంటూ…తనకు బదులు సమర్థులైనవారిని నియమిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే సంతృప్తి అన్నారు నాని. పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతూ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.