- చిట్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే
చిట్యాల, వెలుగు: మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీలోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతరం పట్టణంలోనే బీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చిట్యాల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేశారన్నారు. చిట్యాలలో 12 వార్డులు రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్నారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లను కేటాయిస్తామన్నారు. చిట్యాల లోని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామన్నారు. మున్సిపాలిటీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. చిట్యాల మాజీ సర్పంచ్ గుండెబోయిన సైదులు శ్రీలక్ష్మి కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ, కాటం వెంకటేశం, పందిరి శ్రీను, పోకల దేవదాస్, జడల చిన్న మల్లయ్య, నర్రా మోహన్ రెడ్డి, మారగోని ఆంజనేయులు, పాటి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
