24 గంటల కరెంట్​ ఏడిస్తున్నరు? : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

24 గంటల కరెంట్​ ఏడిస్తున్నరు? : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

24 గంటల కరెంట్​ ఏడిస్తున్నరు?

కేటీఆర్​ను ప్రశ్నించిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

సబ్​ స్టేషన్​కు వెళ్లి చెక్​ చేద్దామని సవాల్​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్​ ఇస్తున్నట్లు బీఆర్​ఎస్​ ప్రభుత్వం చెప్పడం బూటకమని కాంగ్రెస్​ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. కనీసం 10 గంటలైనా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ సబ్​స్టేషన్​కు వెళ్లినా ఈ విషయం తెలుస్తుందని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంత్రి కేటీఆర్​ ఏ సబ్​స్టేషన్​ అంటే అక్కడికి వెళ్లేందుకు సిద్ధం. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​ ఎక్కడైనా ఓకే. కేటీఆర్​ సిద్ధమా?” అని సవాల్​ చేశారు.

ఎక్కడా పది గంటలు కూడా ఉచిత కరెంట్​ ఇవ్వడం లేదన్నారు. సబ్​స్టేషన్​ లాగ్​బుక్కులు ఓపెన్​ చేస్తే ఆ విషయం తేలిపోతుందని చెప్పారు. ఒకవేళ 24 గంటల ఉచిత కరెంట్​ ఇస్తున్నారని తేలితే తాను ఆ సబ్​స్టేషన్​ వద్దే రాజీనామా చేస్తానని, ఒకవేళ ఇవ్వకుంటే కేటీఆర్​ రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాగా, దేశాన్ని కలిపి ఉంచేందుకు రాహుల్​ గాంధీ జోడో యాత్ర చేశారని, అలాంటి వ్యక్తిపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు బనాయించిందని ఆయన మండిపడ్డారు.