ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు ఉరికించి కోడ్తరు

ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు ఉరికించి కోడ్తరు

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు ఉరికించి కోడ్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు పిట్టల్లా చనిపోతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్.. ఎందుకు చేర్చడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు.

‘కేసీఆర్ నీకు మానవత్వం ఉందా? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతానని అసెంబ్లీ సాక్షిగా చెప్పావు కదా.. ఏమైంది? కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదు? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? కరోనాతో ప్రజలు పిట్టల రాలుతుంటే నీ కంటికి కనిపించడం లేదా? కరోనా టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నీ కొడుకు కేటీఆర్‌కు అప్పగించావు. దాంతో కరోనాను ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేర్చుతారని కేటీఆర్‌ను ప్రజలు ట్విట్టర్ వేదికగా నిలదీస్తున్నారు. నీ కొడుకేమో నీ దృష్టికి తీసుకువస్తానని చెప్పారు. ఇంతకీ మీ దృష్టికి తీసుకొచ్చారా లేదా? రాష్ట్రంలో అయ్యాకొడుకుల డ్రామాలు ఆపండి. కుటుంబపాలనకు స్వస్తి పలికి.. ప్రజల కోసం ఆలోచించండి. కరోనా నుంచి ప్రజలను కాపాడండి. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే అయ్యాకొడుకులను చరిత్ర క్షమించదు. కరోనాతో అల్లాడుతున్న వారికి ఉచిత వైద్యం అందించకపోతే అధికారంలో ఉండి ఏం ఉద్ధరిస్తావు? ప్రజలను కాపాడలేకపోతే ఎందుకు నీకు ఈ ముఖ్యమంత్రి పదవి? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడనికి నీకు అర్హత లేదు. నువ్వు పాలన సాగించేది ప్రజల కోసమా? నీ కుటుంబం కోసమా? నీ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. కేసీఆర్‌కు ప్రజల ఉసురు తగులుతుంది. సీఎం కేసీఆర్ కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తానని చెప్పాడు కదా... మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతుంది మీకు కనిపించడం లేదా? ఎమ్మెల్యేలు, మంత్రులు గుడ్డి గుర్రాల పళ్ళు తొముతున్నారా? ప్రజలు ఓట్లేస్తేనే కదా మీరు గెలిచింది. మరి ప్రజలు కరోనాతో పోరాటం చేస్తుంటే మీ ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయడం లేదు? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? కేసీఆర్‌కు ఇంకా ఎన్ని రోజులు భజన చేస్తారు? ప్రజల గోస మీకు పట్టదా? మీ ప్రభుత్వ నిర్వాకం వల్ల మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇంకా ఎంతమంది పేదల ప్రాణాలు పోవాలి? కరోనాతో చనిపోతున్న వారివి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలు లక్షలు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేకనే చనిపోతున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు ఉరికించి ఉరికించి కోడ్తరు. కేసీఆర్ ఇకనైనా కళ్లు తెరిచి.. కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చండి’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.