జర్నలిస్టులను ఆదుకోవాలంటూ కేసీఆర్‌ కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

జర్నలిస్టులను ఆదుకోవాలంటూ కేసీఆర్‌ కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

హైద‌రాబాద్- కరోనా కారణంగా తెలంగాణలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు మృత్యువాత పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఈ క్ర‌మంలోనే క‌రోనా బారిన‌ప‌డ్డ జ‌ర్న‌లిస్టుల‌ను, మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌ను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్ కు సోమ‌వారం వెంక‌ట్ రెడ్డి లేఖ రాశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దేశం మొత్తంలో దాదాపు 15 రాష్ట్రాలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించారని, వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని తెలిపారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాయన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారి ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ఇతర రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలన్నారు. కరోనాతో జర్నలిస్టులు చనిపోతే వారి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.