50 కార్లతో బీజేపీ లీడర్ భారీ ర్యాలీ : మోదీ చెప్పినా డోంట్ కేర్ అంటున్న కేడర్

50 కార్లతో బీజేపీ లీడర్ భారీ ర్యాలీ : మోదీ చెప్పినా డోంట్ కేర్ అంటున్న కేడర్

నిన్న కాక మెున్ననే ఆదివారం రోజున హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో దేశ ప్రధాని మోడీ నెత్తినోరు కొట్టుకుని మరీ చెప్పారు పెట్రోల్ పొదుపుగా వాడండి అని. కరెక్టుగా రెండు రోజులుగా కూడా గడవక మునుపే మోడీ సూచనలను కనీసం ఆయన సొంత పార్టీ నేతలు కూడా ఫాలో అవ్వకపోవటం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నేతలు ఏదైనా ప్రజలకు చెప్పే ముందు దానిని ఆచరించాలిగా అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. 

వివరాల్లోకి వెళితే.. ప్రపంచ ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వేళ దేశ ప్రజలందరూ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సామాన్యులు మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని మళ్లీ ఫాలో అవ్వమని సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాన మంత్రే పొదుపు మంత్రాన్ని జపిస్తుంటే.. ఆయన సొంత పార్టీ నేతలు మాత్రం ఆ మాటలను గాలికొదిలేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటన బీజేపీ నేతల ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతోంది. కొత్తగా మధ్యప్రదేశ్ పాఠ్యపుస్తక కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన సౌభాగ్య సింగ్ ఠాకూర్.. తన పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ఉజ్జయిని నుంచి భోపాల్‌కు సుమారు 50 కార్ల భారీ కాన్వాయ్‌తో తరలివెళ్లారు. పూలదండలతో అలంకరించిన డజన్ల కొద్దీ ఎస్‌యూవీలు హైవేపై వెళ్తుంటే ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రధాని మోడీ ఒక్క చుక్క పెట్రోల్‌ను కూడా వృధా చేయకండి అంటూ ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసిన మరుసటి రోజే.. ఒక ప్రభుత్వ పదవిలో ఉన్న లీడర్ ఇలా వందలాది లీటర్ల పెట్రోల్ ర్యాలీల కోసం తగలేయడం విమర్శలకు దారితీసింది.

ఈ వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రజలను త్యాగాలు చేయమని కోరే మోడీజీ.. ముందు తన పార్టీ నేతలకు క్రమశిక్షణ నేర్పాలని రాహుల్ గాంధీ హితవు పలికారు. ప్రధాని మాటలు సలహాల్లా లేవని, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనాలని ఎద్దేవా చేశారు. ఒకవైపు సామాన్యుడిని బస్సుల్లో, మెట్రోల్లో వెళ్లమని చెబుతూ.. మరోవైపు బీజేపీ నేతలు లగ్జరీ కార్లలో ఊరేగడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

అయితే బీజేపీ ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ల నుంచి దేశాన్ని రక్షించడమే ప్రభుత్వ బాధ్యత అని.. ప్రధాని కేవలం దేశ ప్రయోజనాల దృష్ట్యా సూచనలు చేశారని పార్టీ ప్రతినిధులు సమర్థించుకున్నారు. అయినప్పటికీ సామాన్యుడికి వర్తించే రూల్స్ అధికార బీజేపీ నేతలకు వర్తించవా అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ఇలా అతిక్రమిస్తే.. ప్రధాని పిలుపునకు అర్థం ఏముంటుందనే అసహనం వ్యక్తమవుతోంది.