- కేంద్రానికి ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం పెరుగుతుండటంతో 20 శాతం తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ మల్లు రవి కోరారు. అలాగే వేసవి సీజన్‌లో యూరియా కొరత లేకుండా చూడాలని, మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు లేఖ రాసినట్టు తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా లేఖ రాసినట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మల్లు రవి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పత్తిలో తేమ శాతం పెరుగుతున్నది. దీనిపై సీసీఐకి రాసిన లేఖలో వివరించాను. తేమ 20 శాతం వరకు ఉన్నా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశాను” అని తెలిపారు.
