
- నిరుద్యోగుల ఉసురు పోసుకున్న కేసీఆర్ కు బుద్ధి చెప్తం
- మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి, వెలుగు: యువత త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్దోచుకుంటున్నాడని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులు, యువతను మభ్య పెడుతున్న కేసీఆర్ఆటలు ఇక సాగవన్నారు. నిరంకుశ వైఖరితో ప్రజల గొంతు నొక్కుతున్న బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు బుద్ధి చెప్పి గద్దె దించడానికి యువత సిద్ధంగా ఉందన్నారు. ‘యూత్కెన్లీడ్’ అనే సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కూకట్పల్లి ఎల్లమ్మబండలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ అవగాహన సదస్సుకు పొంగులేటి చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి అంటూ యువతను మభ్యపెడుతున్న కేసీఆర్ మాటలను నమ్మొద్దన్నారు. మంత్రి మల్లారెడ్డి లాంటి వారి ప్రయోజనం కోసం ప్రైవేటు కాలేజీలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి విద్య, వైద్యాన్ని పేదలకు దూరం చేసిన ఘనుడు కేసీఆర్అని తీవ్రస్థాయిలో విమర్శించారు. టీఎస్ పీఎస్సీ పేపర్‌లీకేజీ వెనుక పెద్ద కుట్ర ఉందని, అది బయటకు రాకుండా విచారణ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అన్యాయానికి గురవుతున్న యువత అధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సభలో పిడమర్తి రవి, యూత్ కెన్లీడ్ సంస్థ వ్యవస్థాపకుడు రఘునాథ్‌యాదవ్ పాల్గొన్నారు.