- ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు అధ్యక్షతన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్ కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలన్నారు.
2010 కంటే ముందు నియామకమైన టీచర్లందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కృష్ణుడు మాట్లాడుతూ బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సమావేశంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, నేతలు రాఘవేందర్, ధనంజయ పాల్గొన్నారు.
