నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతికి కారకులైన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం నుండి విద్యార్థి తల్లిదండ్రులకు నష్టపరిహారం ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలన్నారు.
శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు నాలుగు ర్యాంకులు ఆశ చూపి పట్టపగలు దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. వేలకు వేల ఫీజులు దోపిడీ చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలలోని అందరి విద్యార్థులకు ర్యాంకులు రావని ప్రభుత్వాలకు తెలిసినా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలను ప్రభుత్వమే నియంత్రించాలని తెలిపారు. ఒక విద్యా సంస్థ పేరుతో ఒకటే బ్రాంచ్ ని నడిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం కార్పోరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని మూకుమ్మడిగా అన్ని విద్యాసంస్థలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు.
