
రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ , గురుకుల పాఠశాలలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో ప్రభుత్వ సీట్లను పెంచాలన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు రూ. 1500 నుండి రూ. 5000 లకు పెంచాలన్నారు. ఆగస్టు 23న తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని అంబేద్కర్ భవనంలో జరిగే విద్యార్థి సింహ గర్జన పోస్టర్ను ఎంపీ ఆర్ కృష్ణయ్య విడుదల చేశారు. ఈ విద్యార్థి సింహ గర్జనకు విద్యార్థులు ,మేధావులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని గురుకులాలకు వెంటనే పూర్తిస్థాయి ప్రిన్సిపాల్స్ను నియమించాలన్నారు. సంక్షేమ హాస్టల్లో గురుకులాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులకు మాత్రమే అందుతున్నాయని ఆరోపించారు. సరైన నిరుపేద బీసీలకు చేరడం లేదన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించని యెడల ఉద్యమం తప్పదని హెచ్చరించారు.