సిద్దిపేట, వెలుగు : పదేండ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ. 3.60 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. మోదీ ప్రధాని అయిన తర్వాత పదేండ్లలో రూ.9 లక్షల కోట్లు ఖర్చు చేశారని ఎంపీ రఘునందన్‌రావు వెల్లడించారు. సిద్దిపేట బీజేపీ ఆఫీస్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 100 రోజులు ఉన్న ఉపాధి హామీ పని దినాలను ప్రస్తుతం 120 రోజులకు పెంచారని, దీని వల్లే జరిగే నష్టమేంటో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని సవాల్ చేశారు. భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. కొత్తగా తీసుకొచ్చే చట్టంతో గ్రామ స్థాయిలోనే సర్పంచ్‌లు గ్రామ సభలు ఏర్పాటు చేసి అవసరమైన పనులు చేసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.
రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో ఒక్కో మున్సిపాలిటీకి ఎన్ని నిధులు ఇచ్చారో, కొడంగల్ మున్సిపాలిటీకి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే మున్సిపాలిటీల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికీ రూ.1,260 కోట్లు మురిగిపోతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీజీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, వెంకటేశం, రాంచంద్రారెడ్డి, మార్కండేయులు, వేణుగోపాల్ పాల్గొన్నారు.
