పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ను నిలదీస్తాం

పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ను నిలదీస్తాం

ఆయుష్మాన్ భారత్‌‌ లో కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంత అని ఓ ఐఏఎస్ అధికారిని ప్రశ్నించడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి తప్పు బట్టారు. రాజేంద్రనగర్ బండ్లగూడలో నిర్వహించిన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణలో కేంద్ర మంత్రులు సైతం నీచమైన, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, త్వరలోనే వారికి తగిన బుద్ది చెబుతామన్నారు. కేంద్రమంత్రి సీతారామన్ ను పార్లమెంటులో నిలదీస్తామని తెలిపారు. 

సీతారామన్ తప్పుగా మాట్లాడారు కాబట్టే మీడియా ముందుకు రాలేదని ఎంపీ రంజిత్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా చాలా సార్లు కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంత అని ప్రశ్నించినా కేంద్ర మంత్రులు దాట వేశారని వ్యాఖ్యానించారు. రూ.3500 కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్న కేంద్రం దానికి సంబంధించిన సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు పారేసుకుంటున్న బీజేపీ నాయకులకు పార్లమెంట్ లోనే జవాబు చెబుతామన్నారు.