ఎస్సీలతోపాటు ఎస్టీ వర్గీకరణ చేస్తం: రేవంత్ రెడ్డి

ఎస్సీలతోపాటు ఎస్టీ వర్గీకరణ చేస్తం: రేవంత్ రెడ్డి
  • రుణమాఫీ సరే.. రుణాలపై వడ్డీ మాటేంటీ

హైదరాబాద్, వెలుగు: ఎవరో ఒకరి కోసం తాము ఎస్సీ వర్గీకరణ చేయబోమని, దళిత సమాజం అభివృద్ధి కోసమే చేస్తామని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణతోపాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేస్తామని స్పష్టం చేశారు. దామాషా ప్రకారం వారికి కోటా కేటాయిస్తామని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌‌లో ఇండిపెండెన్స్‌‌ డే వేడుకల తర్వాత ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. వర్గీకరణపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన​అవసరం లేదని పరోక్షంగా మందకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. ‘‘కర్నాటకలో ఆయన ఎవరికి మద్దతిచ్చారో ఒకసారి గుర్తుతెచ్చుకోవాలి. వర్గీకరణపై వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు? కిషన్ రెడ్డి ఆయనకు దేవుడిచ్చిన అన్న కదా. ఆయన్ను ఎందుకు అడగడం లేదు. కేంద్ర కేబినెట్‌‌లో మంత్రిగా ఉన్న కిషన్​ రెడ్డి తలుచుకుంటే వర్గీకరణ జరిగిపోతుంది. 

వర్గీకరణ కోసం కేసీఆర్‌‌‌‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు. అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలను చేపడితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది కదా” అని మందకృష్ణకు ఘాటుగా బదులిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మొదటి నుంచీ అనుకూలంగా ఉన్నది కాంగ్రెస్​ పార్టీనేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ దామాషా ప్రకారం వర్గీకరణ చేసి పంచుతం.. పంచాయితీ తెంచుతమని రేవంత్ స్పష్టం చేశారు. జనరల్ సీట్లలో దళితులు, గిరిజనులకు అవసరాన్ని బట్టి టికెట్లను కేటాయిస్తామని తెలిపారు. ఇక్కడి ఎన్నికల్లో ఏ రాష్ట్రం ఫార్ములానూ అనుసరించబోమని స్పష్టం చేశారు. టికెట్ అప్లికేషన్​కు ఈ నెల 18న ఫీజు ఖరారు చేస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్‌‌ను చూసి కేసీఆర్ వరాలిస్తుండు

రైతు రుణమాఫీ సంగతి సరే.. ఆ రుణాలపై పేరుకుపోయిన వడ్డీ సంగతేందో రాష్ట్ర సర్కార్ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. చక్రవడ్డీలతో ఇప్పటికే రైతులపై వడ్డీ భారం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ వరుసబెట్టి హామీలిస్తుంటే.. సీఎం కేసీఆర్ వాటిని చూసి వరాలిస్తున్నారని రేవంత్​ అన్నారు. ఓటమి భయంతోనే రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వల్లే ప్రజలకు మేలు జరుగుతున్నదని చెప్పారు. కేసీఆర్ ఏం చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. బీఆర్ఎస్ సర్కారు హడావుడిగా చేసిన భూముల వేలంపై అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ పేరుతో ప్రతి గడపకూ వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గాంధీ, అంబేద్కర్, నెహ్రూలనూ స్మరించుకోవాలె

దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలను అందించేందుకు లక్షలాది మంది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘అహింసా మార్గంలో పోరాటం చేయొచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులను కల్పించిన అంబేద్కర్.. కరువు కాటకాలతో అల్లాడిన దేశంలో సంక్షేమ ఫలాలను అందించిన మహానేత నెహ్రూను ఎల్లప్పుడూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం కోసం వీర వనిత 
ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారు. ఐటీ రంగంలో రాజీవ్ గాంధీ గొప్ప స్ఫూర్తినిచ్చారు. పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్‌‌లు దేశాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలబెట్టారు” అని వివరించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం

‘‘విభజించు పాలించు అనే బ్రిటిష్ విధానాన్నే ఇప్పుడు దేశంలో ‘బ్రిటిష్​ జనతా పార్టీ’ (బీజేపీ) అవలంబిస్తున్నది. విద్వేషాన్ని వీడాలంటూ భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు 60 ఏండ్లలో చేసిన అప్పుకంటే.. మోదీ 9 ఏండ్లలోనే దానికి రెండింతల అప్పు చేశారు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది. బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందని చెప్పారు. కానీ పెరిగింది గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలే. దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది” అని రేవంత్ విమర్శించారు. మణిపూర్ మండుతుంటే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు కర్నాటకలో ఓట్ల వేట కోసం వెళ్లారని మండిపడ్డారు. మణిపూర్​కు సైన్యాన్ని పంపించి సమస్యను పరిష్కరించాల్సిందిపోయి.. కర్నాటకకు ఈడీ, సీబీఐలను పంపించి రాజకీయాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.