యుద్ధాన్ని ఆపేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించాలె

యుద్ధాన్ని ఆపేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించాలె

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో నెలకొన్న ఉద్రిక్తతలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన చర్యలను మోడీ ప్రభుత్వం చేపట్టాలన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులను తిరిగి స్వదేశానికి రప్పించాలన్నారు. ఉద్రిక్తతలను ఆపేందుకు భారత్ ప్రయత్నించాలని, ఈ విషయంలో మోడీ సర్కారు జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్ కోరడంలో తప్పు లేదన్నారు. ‘ఇతర దేశాలపై దాడులకు దిగడానికి భారత్ వ్యతిరేకం. అదే సమయంలో యుద్ధం, హింస ద్వారా పాలనను మార్చే ప్రయత్నాలకు కూడా వ్యతిరేకంగా ఉండాలనేది మన విధానం’ అని థరూర్ చెప్పారు. కానీ అన్యాయంగా ఇతర దేశాలపై దాడులకు దిగే చర్యలను మాత్రం వ్యతిరేకించాలన్నారు.

‘ఒకవేళ చైనీయులు మన దేశంలోకి దూసుకొస్తే.. ఇతర దేశాలు మనకు మద్దతుగా ఉండాలని కోరుకుంటాం. ఉక్రెయిన్ కూడా అదే కోరుకుంటోంది. రష్యాతో భారత్ చర్చలు జరపాలనేది వారి విజ్ఞప్తి. కాబట్టి రష్యాతో చర్చలు జరిపేందుకు మోడీ సర్కారు ప్రయత్నించాలి’ అని థరూర్ సూచించారు. తద్వారా ఆపదలో ఉన్న ఉక్రెయిన్ కు సాయం చేసిన దేశంగా నిలవాలన్నారు. ఉక్రెయిన్ లో దాదాపు 24 వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారని.. వారిలో కేవలం 2,300 మంది మాత్రమే స్వదేశానికి చేరుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన వారు అక్కడే చిక్కుకున్నారని.. వారిని విమానాల్లో తిరిగి రప్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యేలా లేదన్నారు. 

మరిన్ని వివరాల కోసం:

భారత ఎంబసీలో తలదాచుకుంటున్న విద్యార్థులు

ఉక్రెయిన్‎పై రష్యా యుద్ధం.. లైవ్ అప్‎డేట్స్