ఉక్రెయిన్‎పై రష్యా యుద్ధం.. లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్‎పై రష్యా యుద్ధం.. లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్‎పై రష్యా యుద్దం ప్రకటించింది. మిలటరీ వార్ మొదలుపెట్టినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దాంతో రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‎పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతతో పాటు దాడి చేయోద్దని ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా రష్యా మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్ బలగాలు వెంటనే ఆయుధాలు విడిచి వెనక్కి వెళ్లాలని రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్‎ను మూడువైపులా చుట్టుముట్టి ముప్పెట దాడికి దిగింది. దూకుడుమీదున్న రష్యా బలగాలు.. ఉక్రెయిన్‎లోకి చొచ్చుకెళ్తున్నాయి.

  • ఉక్రెయిన్ లో భారతీయుల కోసం కంట్రోల్ రూం, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్

విదేశాంగ శాఖ కంట్రోల్ రూమ్

టోల్ ఫ్రీ: 1800118797

ఫోన్‌ నెంబర్లు : +91 11 23012113, +91 11 23014104, +91 11 23017905

ఫ్యాక్స్: +91 11 23088124

ఈ మెయిల్: situationroom@mea.gov.in

  • ఉక్రెయిన్‌లో 24x7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ : +380 997300428, +380 997300483

ఈ మెయిల్: cons1.kyiv@mea.gov.in

వెబ్‌సైట్: www.eoiukraine.gov.in

  • హంగేరీ సరిహద్దు నుంచి భారతీయుల తరలింపు

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను హంగేరీ సరిహద్దుల ద్వారా తరలించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే హంగేరీ, ఉక్రెయిన్ సరిహద్దుల్లోని జొహానైకు చేరుకున్న ఇండియన్ ఎంబసీ సిబ్బంది అక్కడి ప్రభుత్వ సాయంతో ఇండియన్లను హంగేరీకి తీసుకురానున్నారు. అక్కడి నుంచి వారిని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

  • ఇవాళ రాత్రి పుతిన్తో ఫోన్లో మాట్లాడనున్న మోడీ

ఉక్రెయిన్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో మాట్లాడనున్నారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభంతో పాటు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత గురించి ఇవాళ (ఫిబ్రవరి 24) రాత్రి ఫోన్ లో చర్చించనున్నట్లు సమాచారం. 

  • 74 మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసిన రష్యా

ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్కు చెందిన 74 మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. వాటిలో 11 వైమానిక స్థావరాలు కూడా ఉన్నాయి. మిలటరీ హెలికాప్టర్లతో పాటు నాలుగు డ్రోన్లను సైతం కూల్చినట్లు రష్యా డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. 

  • దలాల్ స్ట్రీట్ బ్లడ్ బాత్.. 10లక్షల కోట్లు ఆవిరి

రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడం ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. సెన్సెక్స్ 2702.15 పాయింట్ల నష్టంతో 54,529.91 వద్ద క్లోజయింది. నిఫ్టీ 815.30 పాయింట్ల లాస్తో 16247.95 వద్ద ముగిసింది.

వార్ ఎఫెక్ట్ : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • దాడులు ఉక్రెయిన్ ప్రజలకు వ్యతిరేకం కాదన్న పుతిన్

ఉక్రెయిన్ దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ సమర్థించుకున్నారు. సైనిక చర్య ఉక్రెయిన్కు, ఉక్రెయిన్ ప్రజలకు వ్యతిరేకం కాదన్నారు. ఉక్రెయిన్ను ఆక్రమించి రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటున్న వారికి వ్యతిరేకంగా మాత్రమే తాము పోరాటం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న ప్రజలు దీనిని ఎంజాయ్ చేయాలంటూ పుతిన్ పిలుపునిచ్చారు.

  • దేశం కోసం ఆయుధాలు చేతబట్టండి

రష్యాతో దౌత్యపరమైన సంబంధాలన్నింటినీ తెంచుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దేశం కోసం పోరాడేందుకు పౌరులు ముందుకొచ్చి తుపాకులు చేతబట్టాలని పిలుపునిచ్చారు. 

  • రష్యా దాడుల్లో ఏడుగురు పౌరుల మృతి

ఉక్రెయిన్పై రష్యా దళాలు చేస్తున్న బాంబు దాడుల్లో ఏడుగురు చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దేశంలో ప్రధాన నగరమైన ఒడిసా శివారు ప్రాంతమైన పొడిల్స్క్ లోని సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఆరుగురు పౌరులు మృత్యువాతపడగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరియుపోల్ సిటీపై జరిపిన దాడిలో ఒకరు చనిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఉక్రెయిన్పై దాడులకు పాల్పడుతున్న 50 మంది రష్యా చొరబాటుదారులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. 

  • మానవతా దృక్పథంతో సాయం చేయండి

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ భారత సాయం కోరింది. శాంతిని కోరుకునే భారత్ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించి, యుద్ధం ఆపేందుకు ప్రధాని మోడీ కృషి చేయాలని భారత్ లో ఆ దేశ రాయబారి డాక్టర్ ఇగోర్ పొలిఖా కోరారు. ప్రపంచంలో శక్తివంతమైన ప్రధానుల్లో ఒకరైన మోడీ.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ను ప్రభావితం చేయగలరని ఆశాభావం వ్యక్తంచేశారు.

  • ఉక్రెయిన్లో భారత విద్యార్థుల కోసం కంట్రోల్ రూం

ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. అక్కడ ఉన్న విద్యార్థుల భద్రత కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరింది. 

భారత విదేశాంగ కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నెంబర్లు:

+91 11 23012113, +91 11 23014104, +91 11 23017905,  1800118797 (టోల్ ఫ్రీ). 

ఈమెయిల్ ఐడీ : situationroom@mea.gov.in.

  • ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. ధరలు పెరిగే చాన్స్

రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో రష్యా వైపు నిలుస్తామని చైనా చెబుతుండగా.. నాటో దేశాలు ఉక్రెయిన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. కాగా.. భారత్ మాత్రం తటస్థ వైఖరిని ఎంచుకుంది. అయితే మన దేశంపై ఈ వార్ ప్రభావం పడుతుందనడంలో అనుమానం లేదు. మన ఎకానమీపై మేజర్ ఇంపాక్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మన వంటింటిపై ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడబోతోందని ఎక్స్‎పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వంట నూనె రేట్లు చాలా పెరుగుతాయంటున్నారు. అలాగే పెట్రో ఉత్పత్తులు, వంట గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయని, ఈ పరిణామాలతో సామాన్యుడి జేబుకు చిల్లుపడడం ఖాయమని చెబుతున్నారు.

ఏయే ధరలు పెరిగే చాన్స్ ఉందంటే.. పూర్తి వివరాల కోసం
 

  • రష్యా– ఉక్రెయిన్ బలా బలాలు

రష్యా
యూరప్‎లో అతి పెద్ద దేశం
జనాభాలో యూరప్‎ ఖండంలోనే నెంబర్ వన్.
మిలటరీ కోసం 61.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది.
ప్రపంచంలోనే టాప్ 5 సైనిక బలం కలిగిన దేశాల్లో రష్యా ఒకటి.    
సైన్యం 8,50,000        
4,100 యుద్ధవిమానాలు
772 ఫైటర్ విమానాలు
30,000 సాయుధ వాహనాలు
12,500 యుద్ధ ట్యాంకులు
14,000 ఆర్టిలరీ గన్స్
600 నేవీ వార్ షిప్స్
70 సబ్ మెరైన్స్    
మిస్సైల్ టెక్నాలజీలో లీడర్


ఉక్రెయిన్ 
యూరప్‎లో రెండో పెద్ద దేశం
యూరప్ ఖండంలో జనాభాలో ఏడో స్థానంలో ఉంది.
మిలటరీ కోసం 5.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది.
ప్రపంచంలో సైనికబలంలో 22వ స్థానంలో ఉంది.
సైన్యం 2,50,000
318 యుద్ధవిమానాలు
69 ఫైటర్ విమానాలు
12,000 సాయుధ వాహనాలు
2,600 యుద్ధ ట్యాంకులు
3,000 ఆర్టిలరీ గన్స్
38 వార్ షిప్స్
సబ్ మెరైన్స్ లేవు        
అమెరికా పంపిన యాంటీ ట్యాంక్ మిసైల్స్ మాత్రమే ఉన్నాయి.

  • రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై పాక్ తన వైఖరి చెప్పాలి

రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై పాక్ తన వైఖరి చెప్పాలంటూ అమెరికా డిమాండ్ చేసింది. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగతున్న ఈ తరుణంలో.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల తన పర్యటనలో భాగంగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్‎తో ఇమ్రాన్ ఖాన్ భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడంపై చర్చలు చేయనున్నారు. కాగా.. రష్యా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై పాక్ వైఖరి స్పష్టంచేయాలని అగ్రరాజ్యం డిమాండ్ చేస్తోంది.

  • రష్యాకు ఉక్రెయిన్‎కు గొడవెందుకు వచ్చింది?

ఉక్రెయిన్‎తో పాటు సోవియట్ దేశాలకు నాటోలో సభ్యత్వం ఇవ్వొద్దని, అదేవిధంగా నాటో బలగాలను సెంట్రల్, ఈస్టెర్న్ యూరోప్ నుంచి వెనక్కి తీసుకోవాలని రష్యా డిమాండ్ చేసింది. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అయితే రష్యా సూచనను పట్టించుకోకుండా.. ఉక్రెయిన్‎కు నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి నాటో సభ్య దేశాలు అంగీకరించాయి. ఈ మధ్యకాలంలో రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ లోని సెపరేట్ ఉద్యమకారులకు మద్ధతు ప్రకటించాడు. దాంతో రష్యా తన బలగాలను ఉక్రెయిన్ నుంచి వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పింది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరి యుద్ధానికి దారితీసింది.

  • భారత్ ఏ దేశం వైపు?

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు నాటో దేశాలు.. ఉక్రెయిన్‎కు మద్దతు ప్రకటించాయి. కాగా.. చైనా మాత్రం రష్యాకు సపోర్ట్ చేస్తోంది. మరి ఈ సమయంలో భారత్ ఏ దేశం వైపు నిలుస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై భాతర విదేశాంగ శాఖ స్పందించి.. భారత ప్రభుత్వ వైఖరిని వెల్లడించింది.

 

ఉక్రెయిన్‎పై రష్యా యుద్ధానికి దిగడం యావత్ ప్రపంచానికీ ఆందోళన కలిగించే అంశమని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ అన్నారు. ఇరుదేశాలూ సంయమనం పాటించాలని, శాంతిని నెలకొల్పాలని కోరారు. ఈ క్రైసిస్ విషయంలో భారత్ తటస్థ వైఖరిని ఎంచుకుందని, ఏ దేశం వైపూ మొగ్గు చూపబోదని స్పష్టం చేశారు. ఆ రెండు దేశాలు శాంతియుత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని రంజన్ సింగ్ కోరారు.

  • ఈ గొడవ ఇప్పటికైనా ఆగాలి

రష్యా, ఉక్రెయిన్ మధ్య గొడవ ఇప్పటికైనా ఆగాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటినియో గుటెరస్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. పుతిన్ కు నేను అప్పీల్ చేస్తున్నాను. మానవతా హృదయంతో  రష్యన్ దళాలను వెంటనె వెనకకు రప్పించాలి. ఉక్రెయిన్‌పై దాడి చేయకుండా మీ దళాలకు ఆదేశాలు ఇవ్వండి. ఉక్రెయిన్‎లో శాంతికి అవకాశం ఇవ్వాలని.. ఇప్పటికే అక్కడ చాలా మంది చనిపోయారని గుటెరస్ అన్నారు.

  • ఉక్రెయిన్‌‎పై రష్యా దాడులతో భయపడిపోయాను: బ్రిటన్ ప్రెసిడెంట్ బోరిస్ జాన్సన్

ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడులతో తాను భయపడిపోయానని యూకే ప్రెసిడెంట్ బోరిస్ జాన్సన్ అన్నారు. తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై అకారణంగా దాడలు చేయిస్తున్నారని బోరిస్ అన్నారు. ఈ దాడులపై తమ దేశంతో పాటు మిగిలిన మిత్రదేశాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయని ఆయన చెప్పారు.
 

  • రష్యా దాడులపై భారత్ కీలక వ్యాఖ్యలు

రష్యా దాడులపై ఐక్యరాజ్యసమితిలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. శాంతి భద్రతలకు విఘాతం కలిగి రెండు దేశాలు పెను సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలైన డొనెట్స్క్ , లుహాన్స్క్‌లలో రష్యా  సైన్యం దాడులకు దిగిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి ఈ ప్రకటన చేశారు.

ఉద్రిక్తతలను తక్షణం తగ్గించాలన్న భారత్ పిలుపును పునరుద్ఘాటిస్తూ తిరుమూర్తి, ‘పరిస్థితి పెను సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అప్రమత్తం కాకపోతే.. శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశముంది. సంబంధిత దేశాల మధ్య నిరంతర దౌత్య చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుంది’ అని ఆయన అన్నారు. 

  • ఉక్రెయిన్ ప్రజల రక్షణ కోసమే దాడులు: రష్యా

ఉక్రెయిన్‎పై యుద్ధానికి దిగిన రష్యా.. తమ దాడులను ఐక్యరాజ్య సమితి (యూఎన్) వేదికగా సమర్థించుకుంది. ఉక్రెయిన్ ప్రజల రక్షణ కోసమే తమ అధ్యక్షడు పుతిన్ మిలిటరీ ఆపరేషన్ నిర్ణయం తీసుకున్నారని రష్యా ప్రతినిధి యునైటడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‎లో ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్న ఉక్రెయిన్ ప్రజల క్షేమం కోసం ఈ దాడులు చేశామన్నారు.

  • రష్యా దురాక్రమణపై ప్రపంచం స్పందించాలె: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి

ఉక్రెయిన్‎పై రష్యా చేస్తున్న యుద్ధంపై ప్రపంచదేశాలు స్పందించాలని ఆ దేశ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబా అన్నారు. దురహంకారంతో పుతిన్ ఈ యుద్ధానికి కాలుదువ్వారని, తమను తాము రక్షించుకోవడంతో పాటు రష్యాకు ఎదురునిలిచి విజయం సాధిస్తామని ఆయన అన్నారు.‘‘ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్ సిటీలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా దురహంకారంతో ఈ యుద్ధానికి దిగింది. ఉక్రెయిన్ స్వశక్తితో రష్యాను ఎదుర్కొని విజయం సాధిస్తుంది’’ అని కులెబా అన్నారు. ఈ సమయంలో ప్రపంచం పుతిన్‎ను నిలువరించాలని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలు తక్షణం స్పందించాల్సిన సమయమిదని డిమిత్రో అన్నారు.

  • ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రత్యేక విమానం

ఉక్రెయిన్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంపై రష్యా దాడులకు దిగింది. మూడు వైపుల నుంచి దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ లో ఉన్న మనవాళ్లను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత్ ఇప్పటికే అక్కడకు విమానాలు పంపింది. తాజాగా విద్యార్థులతో సహా భారతీయ పౌరులతో కూడిన ప్రత్యేక విమానం ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ నుంచి భారత్ కు చేరుకున్న ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని మాట్లాడుతూ.. మేం నివసించే స్థలం సరిహద్దుకు దూరంగా ఉన్నందున అక్కడ పరిస్థితి బాగానే ఉందన్నారు. కానీ మా రాయబార కార్యాలయం మమ్మల్ని దేశం విడిచిపెట్టమని చెప్పిందని తెలిపారు. మరో విద్యార్థి మాట్లాడుతూ.. గత రాత్రే తమకు 30 రోజుల పాటు ఉక్రెయిన్‌లో అత్యవసర పరిస్థితి గురించి మెసేజ్ వచ్చిందన్నారు. దీంతో ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చమన్నారు.

  • రష్యా దాడులను తప్పుబట్టిన అమెరికా

ఉక్రెయిన్పై రష్యా దాడులను అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది.  అన్యాయంగా ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. రష్యా దాడుల వల్ల కలిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశమే పూర్తి బాధ్యత వహించాలని బైడెన్ అన్నారు.

  • ప్రపంచ దేశాలకు పుతిన్ వార్నింగ్

ప్రపంచ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధంలో జోక్యం చేసుకుంటే ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.

  • ఉక్రెయిన్‎లో నెల రోజుల ఎమర్జెన్సీ

రష్యా చర్యలకు ప్రతి చర్యలతో ఉక్రెయిన్ అప్రమత్తమైంది. ఉక్రెయిన్ లో నెల రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ సమయంలో ర్యాలీలు, ప్రచారాలు, సమావేశాలు, సభలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. అవసరమైతే మరో 30 రోజులు ఎమర్జెన్సీ పొడిగిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. దేశ ప్రజలనుద్దేశించి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమీర్ జెలెన్ స్కీ భావోద్వేగంతో మాట్లాడారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‎కు తాను ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడంలేదని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రజల స్వతంత్రత, స్వేచ్ఛను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.