ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీయే క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా తక్కువ సంఖ్యలోనే కట్టారని, అందులోనూ లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. వైన్స్ షాపుల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాను హుజూర్ నగర్ నుంచి, తన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేస్తుందని, ఇందుకోసం గాంధీభవన్ లో అప్లై చేశామన్నారు.
రాహుల్ ప్రధాని అయ్యేందుకు 5 రాష్ట్రాల ఎన్నికలు మొదటి అడుగు అని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది జనం మీద పడి దోపిడీ చేసుకోవడానికి అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ 70 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 9 ఏళ్లల్లో అప్పులు భారీగా పెరిగాయన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడి మీద రూ. లక్ష అప్పు ఉందన్నారు. అందర్నీ తాకట్టు పెట్టి సీఎం కేసీఆర్ లక్షల కోట్లు అప్పు తెచ్చారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఇంటికి పంపియడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందన్నారు.
ఇసుక వ్యాపారంలోనూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల హవా నడుస్తోందన్నారు. ప్రశ్నించే వారిని అణిచి వేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ కు 10 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ర్టాన్ని ఆగమాగం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ర్టాన్ని అవినీతిలో ముంచేశాడన్నారు. తెలంగాణ ప్రజలకు ఏ అభివృద్ధి కనిపించడం లేదున్నారు. కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిందని, రోడ్లు, ప్రాజెక్టులు, కరెంటు సప్లై వంటి అభివృద్ధి కార్యక్రమాలను తమ పార్టీ అమలు చేసిందన్నారు. ముందస్తుగా 115 సీట్లు ప్రకటించడం ద్వారా కేసీఆర్ పార్టీకి నష్టం జరుగుతుందన్నారు.