ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఎంపీ వంశీకృష్ణ.. అంతర్జాతీయ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం

ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఎంపీ వంశీకృష్ణ.. అంతర్జాతీయ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం
  • న్యూయార్క్ చేరుకున్న  భారత ఎంపీల బృందం  
  • హైలెవల్ భేటీల్లో  కీలక అంశాలపై చర్చలు 

న్యూఢిల్లీ/న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి, సమానత్వం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. ‘ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే విజన్​తో దేశం ముందుకు వెళుతోందని.. గ్లోబల్ కోఆపరేషన్, సమగ్ర అభివృద్ధిలో చాంపియన్ గా కొనసాగుతోందన్నారు. 

యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి అఖిలపక్ష పార్టీల ఎంపీల బృందం బుధవారం న్యూయార్క్​కు చేరుకున్నది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. భారత ఎంపీల బృందంలో ఒకరిగా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. 

చాలా ఏండ్ల తర్వాత భారత ఎంపీల బృందానికి ఈ అవకాశం దక్కిందని, ఇది భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి, అంతర్జాతీయంగా పోషిస్తున్న క్రియాశీలక పాత్రకు నిదర్శనమని యునైటెడన్ నేషన్స్​లో భారత శాశ్వత మిషన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీనియర్ ఎంపీల నాయకత్వంలోని ఈ బృందం యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైలెవల్ భేటీల్లో పాల్గొననుందని వెల్లడించింది. 

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, పేదరిక నిర్మూలన, క్లైమేట్ చేంజ్, క్లీన్ ఎనర్జీ, విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పన, ప్రపంచ శాంతి, భద్రత, గ్లోబల్ సౌత్ మధ్య సహకారం వంటి అంశాలపై ఎంపీల బృందం చర్చలు జరపనుందని పేర్కొంది.