పెద్దపల్లికి రావాల్సిన సెమీకండక్టర్ యూనిట్‌ను అన్యాయంగా ఏపీకి తరలించారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. డిసెంబర్ 15న కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన ఎంపీ వంశీ కృష్ణ.. పెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు ఆవశ్యకతపై విజ్ఞప్తి చేశారు.
అనంతరం మాట్లాడిన ఆయన.. కేవలం కూటమి రాజకీయాల వల్ల.. ఏపీ సీఎం చంద్రబాబు మెప్పు కోసం ప్రధాని మోదీ సెమీ కండక్టర్ యూనిట్ ను ఏపీకి తరలించారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో సెమీ కండక్టర్ యూనిట్ వస్తే అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ ప్రాంతం రాష్ట్రానికి, దేశానికి పెద్ద మొత్తంలో కంట్రిబ్యూట్ చేస్తున్నదని, అందువల్ల పెద్దపల్లికి ఐటీ, సెమి కండక్టర్ ఫెసిలిటీ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా యువతకు పెద్దమొత్తంలో ఉద్యోగాలు వస్తాయన్నారు. అందుకే మరోసారి కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు వంశీకృష్ణ.
లోక్ సభలో ప్రస్తావన
పెద్దపల్లిలో సెమీకండక్టర్ ఏర్పాటు విషయంపై ఎంపీ వంశీకృష్ణ డిసెంబర్ 10న లోక్ సభలో ప్రస్తావించారు. దీనికి సమాధానంగా సెమీకండెక్టర్స్ ఎకో సిస్టం ఏర్పాటు కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, ఎంపీ వంశీకృష్ణకు బదులిచ్చారు. సెమీకండక్టర్ విషయంలో డీపీఆర్‌లు ఉంటే సమర్పించాలని ఎంపీ వంశీకృష్ణకు సూచించారు. వాటిని తప్పకుండా పరిశీలనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ కేంద్రమంత్రిని కలిసి మరోసారి విజ్ఞప్తి చేశారు ఎంపీ వంశీకృష్ణ.
