గత పదేళ్లుగా రేషన్ కార్డులు లేక నిరుపేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తున్నామని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్ కార్డులే ప్రాతిపదిక అని, దీని ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను పొందవచ్చని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు అందకూడదనే దురుద్దేశంతోనే గత ప్రభుత్వం పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఆరు లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను, దాదాపు 3 కోట్ల 42 లక్షల మంది నిరుపేదలకు పంపిణీ చేస్తున్నామని... రేషన్ కార్డుల ద్వారా పేదల ముఖాల్లో సంతోషం చూస్తున్నామని వంశీకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఇదొక నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ అన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం ఎంతో సంతోషకరమన్నారు. విద్యారంగ అభివృద్ధికి తమవంతుగా ఎలాంటి సహాయ సహకారాలనైనా అందిస్తామని, ఏలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని భరోసానిచ్చారు.
ఎందరో పోరాట వీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చేశారని వంశీకృష్ణ మండిపడ్డారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని గత పాలకులు ఆర్థిక విధ్వంసానికి గురిచేశారని ఆరోపించారు. అయినప్పటికీ, ప్రజా పాలనలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
