
- సమ్మిళిత వృద్ధికి వాణిజ్యం ఇంజిన్‌లా పనిచేయాలి
- గ్లోబల్ వ్యాల్యూ చైన్ లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెరగాలి
న్యూయార్క్: ప్రపంచ దేశాలన్నీ కలిసి డెవలప్ కావాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ సంక్షోభంలో ఉందని, వృద్ధి మందగించిందని ఇలాంటి పరిస్థితుల్లో సమ్మిళిత వృద్ధికి వాణిజ్యం ఒక ఇంజిన్ లాగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి రెండో రోజు సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. మాక్రోఎకనామిక్ పాలసీ, ఇంటర్నేషనల్ ట్యాక్స్ కోఆపరేషన్ పై మాట్లాడారు. న్యాయమైన, పారదర్శకమైన, సమ్మిళిత ట్రేడింగ్ సిస్టమ్ కు భారత్ ఎప్పుడూ మద్దతు తెలుపుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ పై సంస్కరణలకూ ఇండియా మద్దతు ఉంటుందని చెప్పారు.
అన్ని దేశాలూ సమ్మిళిత వృద్ధిని సాధించాలన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఏ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ వ్యాపారంలో నియమాలకు కట్టుబడే, పారదర్శక, సమ్మిళిత ట్రేడింగ్ సిస్టమ్ కు భారత్ మద్దతు తెలుపుతుందని చెప్పారు. గ్లోబల్ వ్యాల్యూ చైన్ లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం ట్రేడింగ్ ద్వారా పెరగాలని ఆకాంక్షించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకను వినిపించడం అత్యవసరమన్నారు. అప్పుల నిర్వహణ, అప్పుల పారదర్శకతకు ఇండియా మద్దతు ఇస్తుందన్నారు. సమ్మిళిత అభివృద్ధికి పెట్టుబడులను వేగంగా సమీకరించాలని ఎంపీ సూచించారు.
యూఎన్‌వోలో గాంధీ విగ్రహానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నివాళి
పెద్దపల్లి, వెలుగు: ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) ప్రధాన కార్యాలయంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “అహింస, శాంతి, సత్యం అనే విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహాత్మా గాంధీ ఆలోచనలు నేటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకాలు” అని పేర్కొన్నారు. దేశ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనడం గర్వంగా ఉందని తెలిపారు. రెండు రోజుల కింద ఎంపీ వంశీకృష్ణ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు.