ఎంపీ, ఎమ్మెల్యేల నిధుల‌ను క‌రోనా చికిత్స‌కే కేటాయించాలి

ఎంపీ, ఎమ్మెల్యేల నిధుల‌ను క‌రోనా చికిత్స‌కే కేటాయించాలి

వరంగల్ రూరల్ జిల్లా: ఎంపీ, ఎమ్మెల్యేల అభివృద్ధి నిధుల‌ను క‌రోనా వైద్య స‌దుపాయాల‌కే ఖ‌ర్చు చేయాలని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. గ్రామాల్లోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నందున గ్రామాల పారిశుద్ధ్యంపై క‌లెక్టర్లు దృష్టి సారించాలని చెప్పారు. క‌రోనా వైర‌స్ విస్తృతి నివార‌ణ-పెంచాల్సిన వైద్య స‌దుపాయాల‌పై ప‌ర్వత‌గిరి నుంచి మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి.. క‌రోనా క‌ట్టడికి తీసుకోవాల్సిన చ‌ర్యలు, చికిత్సలు, బెడ్స్, మందులు, ప‌రీక్షలు, ఇత‌ర పరిక‌రాల ప‌రిస్థితుల‌ు, అందుబాటులో ఉన్న వైద్య స‌దుపాయాలు, పెంచాల్సిన సౌక‌ర్యాల‌పై త‌దిత‌ర విష‌యాల గురించి అధికారులను ఆరా తీశారు.

అన్ని జిల్లా కేంద్రాల్లోని వైద్యశాల‌లో సౌక‌ర్యాలు మ‌రింత‌గా మెరుగు ప‌ర‌చాలని, క‌రోనాపై ప్రజ‌ల‌ను మ‌రింత‌గా చైత‌న్య ప‌రిచే కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్లు, సానిటేష‌న్ వంటి ఇత‌ర స‌దుపాయాలు పెంచాలని ఆదేశించారు. అదే విధంగా ప్ర‌జ‌లు కూడా వైర‌స్ సోక‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. ఒక‌వేళ క‌రోనా వ‌స్తే… చ‌నిపోతామ‌నే భ‌యం వ‌ద్దని, అన్ని రకాల వైద్య స‌దుపాయాలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు.