ప్రతిపక్ష నేతగా దళితుడు ఉండొద్దా : ఎమ్మార్పీఎస్, పీసీసీ

ప్రతిపక్ష నేతగా దళితుడు ఉండొద్దా : ఎమ్మార్పీఎస్, పీసీసీ

హైదరాబాద్ ధర్నాచౌక్ లో ఆమరణ దీక్ష చేస్తున్న భట్టి విక్రమార్కను ఎమ్మార్పీఎస్ మద్దతు పలికింది. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భట్టిని పరామర్శించారు. కేసీఆర్ రాజకీయ ఉగ్రవాద చర్యలకు బలి అయ్యింది దళితులే అన్నారు మందకృష్ణ. ప్రశ్నించే వాళ్ళను జైల్లో పెట్టి భయపెట్టాలని కేసీఆర్ చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారనీ.. దళితుడు సీఎల్పీ గా ఉండడం కేసీఆర్ ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు మందకృష్ణ. దళితుడు ప్రశ్నిస్తుంటే దొర ఓర్చుకోలేకపోతున్నారనీ.. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేసారని ఆరోపించారు.

కేసీఆర్ రాజకీయాలను భ్రష్టుపట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

దళితులను కేసీఆర్ అణచేయాలని చూస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య అన్నారు.

ప్రతిపక్ష నాయకుడిగా దళితుడు ఉండొద్దనే కుట్ర: పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ పార్టీనుండి గెలిచిన 12 MLA లను కేసీఆర్ అక్రమంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యం కాపాడటానికి భట్టి విక్రమార్క దీక్ష చేస్తున్నారన్నారు. ‘12 నియోజకవర్గాల్లో 12 కమిటీలు వేసి ప్రజలకు ప్రభుత్వ తప్పులు వివరిస్తాం. 12 నియోజక వర్గాల్లో ప్రజా ఉద్యమం చేస్తాం. ఇది మొండి, గుడ్డి, అక్రమ ప్రభుత్వం. ప్రతిపక్షంలో దళితుడు ఉండకూడదని కేసీఆర్ కుట్ర పన్నారు’ అన్నారు పొన్నం.