పదిహేనేళ్ల
అనుకున్నదే తడువుగా సిక్సర్లు కొట్టేసినా.. రెప్పపాటులో స్టంపింగ్స్ చేసినా.. వికెట్లను చూడకుండానే రనౌట్లు చేసినా.. ఇప్పటికీ ఎందరికో అంతుచిక్కని డీఆర్‌ఎస్‌ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనేట్టుగా మార్చేసినా.. సరికొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టించినా అతనికే చెల్లింది.తని ‘మహి’మలు ఒకటా రెండా..
అంతేనా..
కుర్రాళ్ల ఆటగా ముద్రపడ్డ ఐపీఎల్‌లో ‘డ్యాడ్స్ ఆర్మీ’తో మూడుసార్లు టైటిల్ కొట్టి లీగ్‌లో చెన్నైని మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా మార్చేసినా.. ఎంతో మంది కుర్రాళ్లను చాంపియన్లుగా తీర్చిదిద్దినా.. నాయకత్వానికి సరికొత్త రూపం తీసుకొచ్చినా.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఇండియాకు టీ20, వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ అందించినా.. అతనికే సాధ్యమైంది.
ఈ మహిమల ఇంద్రజాలికుడు… ఇండియా క్రికెట్ దార్శనికుడు.. మహేంద్రసింగ్ ధోనీ టీమిండియా ప్రస్థానం ఒకటిన్నర దశాబ్దాల మైలురాయిని దాటింది..!
జులపాల జుట్టుతో అనామకుడిగా జట్టులోకి అడుగిడి.. లెజెండరీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్ హయాంలోనే ధనాధన్ బ్యాటింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, వారితో సరితూగే స్థాయికి ఎదిగిన ధోనీ సోమవారంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2004లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్ జర్నీ డకౌట్‌తో మొదలైనా తర్వాత దేశ క్రికెట్ గతినే మార్చే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలో కలిసి 17266 రన్స్ చేసిన 38 ఏళ్ల మహీ ఇప్పటిదాకా 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20ల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 829 డిస్మిసల్స్‌తో వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా, ఇండియా బెస్ట్‌గా వెలుగొందుతున్నాడు. ఒత్తిడిలో మరింత కూల్గాఉండే ధోనీ కెప్టెన్‌గా ఎన్నో ఘనతలు సాధించాడు. అతని నాయకత్వంలో లిమిటెడ్ ఓవర్లలో ఇండియా తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2007లో టీ20 వరల్డ్‌కప్ సాధించి దేశ క్రికెట్‌కు సరికొత్త బాట చూపిన రాంచీ వీరుడు.. మ్యాచ్ విన్నింగ్ ఇనింగ్స్‌తో పాటు చిరకాలం గుర్తుండిపోయే ‘సిక్సర్’తో 2011లో వన్డే వరల్డ్ కప్‌తో యావత్ దేశం ఉప్పొంగేలా చేశాడు. 2013లో చాంపియన్ ట్రోఫీ కూడా సాధించి ఐసీసీ మూడు మేజర్ టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా కీర్తిని అందుకున్నాడు. అంతేకాదు టెస్టులు, వన్డేల్లో ఇండియాకు నంబర్ వన్ ర్యాంక్ సాధించిపెట్టాడు. ఐపీఎల్‌లోనూ మహేంద్రుడిదే హవా. అతని కెప్టెన్సీలోని చెన్నై మూడు టైటిల్స్ అందుకుంది. చాంపియన్స్ లీగ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచింది.
టెస్టులకు వీడ్కోలు పలికి, కెప్టెన్సీ కోహ్లీకి అప్పగించి.. వైట్‌బాల్ క్రికెట్‌లో జట్టుకు పెద్దన్నగా ఉంటున్న మహీ కెరీర్‌లో మొన్నటి వరల్డ్‌కప్ ఓ చేదు జ్ఞాపకం. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో రనౌటై ఇండియాను గెలిపించలేకపోయిన బాధలో ధోనీ కంట కన్నీరు ఫ్యాన్స్‌ను కదిలించింది. ఆ మెగా టోర్నీ తర్వాత ఆటకు దూరంగా ఉన్న టైమ్‌లో మహీ పదిహేనో వసంతాన్ని పూర్తి చేసుకోవడం గమనార్హం. తన రిటైర్మెంట్ గురించి రోజుకో పుకారు వస్తుండగా.. దీని గురించి జనవరి వరకూ ఏమీ అడగొద్దు అని చెప్పిన మహీ మళ్లీ మైదానంలోకి రావాలని కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు..! వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ అందుకొని ఆటకు సగర్వంగా వీడ్కోలు పలికితే చూడాలని కలలు కంటున్నారు..! మరి, మహీ ఏం చేస్తాడో..!
