పవార్ ఇంటి ముట్టడికి యత్నం.. 105 మందిపై కేసు..

పవార్ ఇంటి ముట్టడికి యత్నం.. 105 మందిపై కేసు..

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటిని మహారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ చాలాకాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నాలుగైదు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా శివసేన భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తమ సమస్యను పట్టించుకోవడంలేదంటూ నిరసనకారులు ఆయన నివాసం వైపు దూసుకుపోయారు. పోలీసు సెక్యూరిటీని దాటుకొని పవార్ ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొందరు నిరసనకారులు చెప్పులు, షూలను పవార్ నివాసం వైపు విసిరారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పవార్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసిన 105 మంది ఎంస్ఆర్టీసీ సిబ్బందిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ గతేడాది నవంబర్ నుంచి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. సమ్మె జరగుతున్న సమయంలోనే 120 మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగ్రహించిన ఉద్యోగులు ఆందోళన ఉద్ధృతం చేశారు. సమస్య పరిష్కరించే వరకు వెనక్కితగ్గే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.