
తెలంగాణలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. ఆడపిల్లలు పట్టు పరికిణీలు ధరించి.. రంగురంగుల ముగ్గులు వేసి.. రంగు రంగుల పూలతో సిద్ధం చేసిన బతుకమ్మలను ముగ్గుపై ఉంచి.. దాని చుట్టూ నృత్యం చేస్తూ తిరుగుతారు. బతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. మూడోరోజు బతుకమ్మ పండుగ విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
బతుకమ్మ ఆటలో మూడో రోజైన విదియ నాడు అమ్మవారిని .. ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి గౌరమ్మకి నివేదిస్తారు. ఆపై ప్రసాదాన్ని ఒకరికొక రు పంచుకుంటారు.
ముద్దపప్పు బతుకమ్మ రోజున కొందరు పుట్నాల పిండి, బియ్యప్పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలతో చలివిడి ముద్దలు చేస్తారు. ఇంకొందరు గారెలు చేస్తారు. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశాక వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడతారు.
ఒక్కేసి పువ్వేసి చందమామ పాట లిరిక్స్
ఒక్కేసి పువ్వేసి చందమామ
ఒక్క జాము ఆయే చందమామ
శివుడికి శ్రీ గద్దె చందమామ
మాకు సారె గద్దె చందమామ
రెండేసి పూలేసి చందమామ
రెండు జాములాయే చందమామ
శివపూజ యాలాయే చందమామ
శివుడు రాకపాయే చందమామ
మూడేసి పూలేసి చందమామ
మూడు జాములాయే చందమామ
శివుడింకా రాడాయే చందమామ
శివపూజ యాలాయే చందమామ
గోరెంట చెట్లల చందమామ
గోడ పెట్టపోయే చందమామ
నాల్గోని పూలేసి చందమామ
నా జాములాయే చందమామ...
శివపూజ యాలాయే చందమామ
శివుడు రాకపాయే చందమామ
రుద్రాక్ష వనములో చందమామ
నిద్రించవాయే చందమామ
ఐదేసి పూలేసి చందమామ
ఐదు జాములాయే చందమామ
శివుడింక రాడాయే చందమామ
శివపూజ యాలాయే చందమామా
బంతి వనములో చందమామ
బంతులాడవాయె చందమామ
ఆరేసి పూలేసి చందమామ
ఆరు జాములాయే చందమామ
శివపూజ యాలాయే చందమామ
శివుడింక రాడాయే చందమామ
మల్లె వనములో చందమామ
మాటలాడవాయే చందమామ
ఏడేసి పూలేసి చందమామ
ఏడు జాములాయే చందమామ
రత్నాల గౌరు చందమామ
నీరాసి కలుపుళ్లు చందమామ
ఎనిమిదో పువ్వేసి చందమామ
ఎనిమిది జాములాయే చందమామ
తీగ తీగల బిందె చందమామ
రాగి తీగల బిందె చందమామ
తొమ్మిదో పువ్వేసి చందమామ
తొమ్మిది జాములాయే చందమామ
రాశువాడలేసి చందమామ
రాశి గలపరారే చందమామ
పదేసి పూలేసి చందమామ
పది జాములాయే చందమామ
తీగ తీగల బిందె చందమామ
రాగి తీగల బిందె చందమామ
శివపూజ యాలాయే చందమామ
శివుడింక రాడాయే చందమామ
శివుడికి శ్రీగద్దె చందమామ
మాకు సారె గద్దె చందమామ
శివుడికి శ్రీ గద్దె చందమామ
మాకు సారె గద్దె చందమామ