జైపూర్ మండలంలోని ఇంటింటా ఇంకుడు గుంత

జైపూర్ మండలంలోని ఇంటింటా ఇంకుడు గుంత
  •      మంచిర్యాల జిల్లా ముదిగుంట ఘనత 
  •      గ్రామంలో పెరిగిన గ్రౌండ్​వాటర్
  •      మన్​కీ బాత్​లో ప్రధాని మోదీ ప్రశంస 

మంచిర్యాల/జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలంలోని ముదిగుంట గ్రామం జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రశంసలందుకుంది. ఆదివారం నాటి మన్​కీ బాత్​లో పీఎం మోదీ ముదిగుంట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రామంలో వందశాతం ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం, రెయిన్​వాటర్ ​హార్వెస్టింగ్​తో గ్రౌండ్ ​వాటర్​ పెరిగిందని, తద్వారా నీటి సమస్య దూరమైందని పేర్కొన్నారు. 

గ్రామస్తుల సమష్టి కృషిని, జల సంరక్షణలో వారి చైతన్యాన్ని మోదీ అభినందించారు. సర్పంచ్ రవి ఆధ్వర్యంలో గ్రామస్తులు పంచాయతీ ఆఫీసు వద్ద మన్​కీ బాత్​ప్రోగ్రాంను వీక్షించారు. స్వయంగా ప్రధాని తమ గ్రామం పేరును ఉటంకిస్తూ మెచ్చుకోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సమష్టి కృషితో సత్ఫలితాలు

ముదిగుంట గ్రామంలో దాదాపు 400 ఇండ్లు ఉన్నాయి. గతంలో భూగర్భజలాలు చాలా లోతుకు పోయి నీటి కోసం గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా సంబంధిత అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. డీఆర్డీఏ, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు సమష్టిగా ఇంటింటా ఇంకుడుగుంతలు నిర్మించుకునేలా ప్రోత్సహించారు. దీంతో గ్రామంలోని సుమారు 300 ఇండ్లలో సోక్​ పిట్స్​ పూర్తి కాగా, మిగతావి చివరి దశలో ఉన్నాయి. 

దీంతోపాటు అధికారులు ఉపాధి హామీ కింద గ్రామ శివారులో నాలుగు చెక్​ డ్యామ్​లు నిర్మించారు. చాలా ఇండ్లలో రెయిన్ ​వాటర్​ హార్వెస్టింగ్​ పిట్స్​ నిర్మించుకొని వర్షపు నీటిని ఒడిసిపట్టారు. గ్రామంలో బోర్​వెల్స్​ రీచార్జి స్ట్రక్చర్స్​ నిర్మించుకున్నారు. అలాగే అవెన్యూ ప్లాంటేషన్​లో భాగంగా రోడ్ల పక్కన రెండు వేల మొక్కలు పెంచారు. గ్రామ శివారులో ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో మరో 10 వేల మొక్కలు నాటారు. 

అడిషనల్​ కలెక్టర్ పరిశీలన

లోకల్​ బాడీస్ అడిషనల్​కలెక్టర్ పి.చంద్రయ్య ఆదివారం గ్రామాన్ని సందర్శించి ఇంకుడుగుంతలు, రూఫ్​టాప్​ రెయిన్ ​వాటర్ ​హార్వెస్టింగ్​నిర్మాణాలను పరిశీలించారు. గ్రామంలో డ్రైనేజీల చివర కమ్యూనిటీ సోక్​ పిట్స్​ నిర్మించి నీటి సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, ఇతర అధికారులు ఉన్నారు.  

ప్రధాని ప్రశంస గర్వకారణం 

ఇంకుడు గుంతల నిర్మాణంతో మా గ్రామం ముందంజలో ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. సెంట్రల్ ఫండ్స్​తో రానున్న రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. అధికారుల సమన్వయంతో  మిగతా ఇండ్లలో కూడా ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటా. -రవి, ముదిగుంట సర్పంచ్