మునుగోడు అభ్యర్థుల గెలుపోటముల్లో ముదిరాజ్ ఓటర్లదే కీలక పాత్ర

మునుగోడు అభ్యర్థుల గెలుపోటముల్లో ముదిరాజ్ ఓటర్లదే  కీలక పాత్ర

నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ముదిరాజ్ (తెనుగు) ఓట్లపై రాజకీయ పార్టీలు ఫోకస్​ పెట్టాయి. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో అత్యధికంగా 1.60 లక్షల మంది బీసీలే ఉన్నారు. దీంతో పార్టీలు బీసీ కులాల వారీగా లెక్కలు తీస్తున్నాయి. ప్రధానంగా టాప్ టెన్ కులాలపై ఫోకస్​ చేశాయి. అందులోనూ 30 వేల నుంచి 35 వేల వరకు ఉన్న ముదిరాజ్ ఓటర్లు అన్ని పార్టీలకు కీలకంగా మారారు. నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కులాల్లో ముదిరాజ్​లు కూడా మొదటి నుంచీ తమ వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు. 

ముదిరాజ్ ఓట్లపై పార్టీల ఫోకస్

ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను మునుగోడులో దింపి ప్రచారం చేస్తున్నాయి. బీసీల్లో ముదిరాజ్​లే కీలకమని, తమ ఓట్లు పార్టీల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి. విఠల్, ముదిరాజ్​ సదర్​ సంఘం కామారెడ్డి జిల్లా సెక్రటరీ చింతల నీలకంఠం, యాదాద్రి జిల్లా ముదిరాజ్ యువసేన నేతలు పేర్కొన్నారు. తెలంగాణ బీసీ సాధికారత కమిటీ సేకరించిన వివరాల ప్రకారం మునుగోడులో ఆయా సామాజిక వర్గాలవారీగా టాప్​టెన్​ ఓటర్లలో గౌడ్స్ (తెనుగు గౌడ్స్ తో కలిపి) – 35 వేల మంది, ముదిరాజ్ (తెనుగు) –34,050 మంది, మాదిగ – 25,650, యాదవ – 21,360, పద్మశాలి – 11,680, లంబాడీ/ఎరుకల –10,520, మాల – 10,350, వడ్డెర – 8,350, కుమ్మరి – 7,850, విశ్వబ్రాహ్మణ – 7,820 మంది ఓటర్లు ఉన్నట్లు వారు తెలిపారు.