
- ఎస్సైతో సహా పలువురికి గాయాలు, రిమ్స్‌కు తరలింపు
- పోలీస్ వెహికల్ ధ్వంసం
- పోడు భూముల్లో మొక్కలు నాటవద్దని వాగ్వివాదం
- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్(కేటీఆర్) పరిధిలోని 71, 72 కంపార్ట్మెంట్లలో ఆదివారం ఉదయం మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులు, పోలీసులను ముల్తానీలు అడ్డుకున్నారు. పోడు భూముల్లో మొక్కలు నాటుతుండగా, అధికారులతో ఘర్షణకు దిగారు. మొక్కలు నాటనిచ్చేది లేదని జేసీబీని అడ్డుకొని పోలీస్, ఫారెస్ట్ అధికారులపై రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు.
ఈ దాడిలో పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లకు గాయాలయ్యాయి. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. గుంపులుగా వచ్చి కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. పెద్ద ఎత్తున రాళ్లు విసరడంతో పొలాల్లో నుంచి పరిగెత్తాల్సి వచ్చింది. ఈ దాడిలో ఇచ్చోడ ఎస్సై పురుషోత్తంతో పాటు పలువురు పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఇచ్చోడ పీహెచ్సీ, ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. దాడులకు కారణమైన వారి వివరాలు సేకరించారు.
ఉద్రిక్త వాతావరణం..
గత కొన్నేళ్లుగా కేశవపట్నంలో ముల్తానీలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఆ భూములకు ఎలాంటి హక్కు పత్రాలు లేవని, ప్రతి ఏడాది చెట్లు నరికి భూములు సాగు చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. వనమహోత్సవంలో భాగంగా వారం రోజులుగా మొక్కలు నాటుతుండగా, రాత్రికి రాత్రే వాటిని తొలగించేస్తున్నారని కేటీఆర్ ఎఫ్ఆర్వో నాగస్వామి తెలిపారు. ఆదివారం పోలీస్ బందోబస్తు మధ్య మొక్కలు నాటుతుండగా, తమపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెప్పారు.
కలప స్మగ్లింగ్‌కు కేరాఫ్..
కేశవపట్నం గ్రామాన్ని కలప స్మగ్లింగ్ కు కేరాఫ్ గా చెప్పుకుంటారు. ఒకప్పుడు ఆ గ్రామానికి వెళ్లాలంటే వెనకడుగు వేసేవారు. రెండు, మూడేళ్ల నుంచి పోలీసుల సహకారంతో ఫారెస్ట్ అధికారులు గ్రామంలో తనిఖీలు చేస్తున్నారు. గత జనవరిలో సైతం పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు కలప కోసం తనిఖీలు చేయగా గ్రామస్తులు దాడులకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. తాజాగా ఆదివారం సైత ముల్తానీల దాడుల్లో పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది తలలు పగిలాయి.